ఢిల్లీ: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ను ప్రైవేటీకరణ చేసినా ఎల్పీజీ సిలిండర్లపై సబ్సిడీ చెల్లిస్తామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
ఎల్పీజీ సిలిండర్ల రాయితీ అనేది వినియోగదారులకే చెల్లిస్తున్నామని, సరఫరా చేసే కంపెనీ ప్రభుత్వానిదా, ప్రేవేటుదా అనేది ఇక్కడ అనవసరమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి వినియోగదారుడు సంవత్సరంలో 12 సిలిండర్లను రాయితీతో తీసుకోవచ్చని, ఎక్కువ కావాలంటే బహిరంగ మార్కెట్ ధరలకు కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు.
పబ్లిక్ సెక్టార్ కంపెనీల ప్రైవేటీకరణలో భాగంగా నవరత్న కంపెనీ అయిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) ను ప్రైవేటీకరణ చేస్తున్నది. ఇందులో 53 శాతం వాటాను ప్రైవేటు సంస్థలకు విక్రయించనున్నది. బీపీసీఎల్ వినియోగదారులు 7.3 కోట్ల మంది ఉండగా, వారందరికీ రాయితీ చెల్లిస్తామని కేంద్ర మంత్రి ప్రధాన్ తెలిపారు.