FbTelugu

బాధితులకు అండగా మేమున్నాం: మంత్రులు

విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ ప్రమాద బాధిత గ్రామాల్లో జీవిఎంసీ సిబ్బంది రోడ్లు, ఇళ్లను అన్ని క్లీన్ చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.

సాయంత్రం ప్రజలందలరూ ఇళ్లకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంటి తలుపులు తీసిన తరువాత లోపలికి వెళ్లి కిటికీలు తెరిస్తే నిలిచిపోయిన రసాయన  గాలి మొత్తం బయటకు వెళ్తుందన్నారు. ఇళ్లను శుభ్రం చేసుకునేందుకు జీవీఎంసీ వాళ్లు రసాయనాలు అందచేస్తారన్నారు. రెండు రోజుల పాటు ఏసీలు, కూలర్లు ఎవరు వాడొద్దని కోరారు. ఇళ్లలో ఉన్న కూరగాయలు, పండ్లు, పాలు వంటివి ఉంటే బయట పారేయాలని ఆయన సూచించారు.

ఈ రోజు గ్రామంలో వచ్చే వాళ్లందరికీ కూడా ప్రభుత్వమే భోజనాలు, మంచినీరు అందిస్తుందన్నారు. ఎవరూ ఈ రోజు ఇళ్లల్లో వంటలు చేయవద్దని అన్నారు. రేపటి నుంచి వాలంటీర్లు మీ ఇళ్లకు వచ్చి నష్టాన్ని అంచనా వేసేందుకు సర్వే చేస్తారు. గ్రామస్తులకు భరోసా కల్పించేందుకు మంత్రులు, అధికారులు ఇక్కడే ఉంటామన్నారు. ఫ్యాక్టరీలో, గ్రామాల్లో పరిస్థితి అంతా అదుపులోనే ఉందన్నారు. రేపటి నుంచి మీ దైనందిన కార్యక్రమాలు చేసుకోవచ్చని అన్నారు.

రేపటికల్లా రూ.10 వేలు మీ ఖాతాలో వేస్తారు. గ్రామంలో పర్మనెంటుగా హెల్త్ క్యాంపు కూడా పెడతామని, అంబులెన్స్, వైద్య సబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారు. కేజీహెచ్ నుంచి డిశ్చార్జీ అయిన వాళ్ళకి ప్రతి 3 నెలలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.

గ్రామాల్లో పరిస్థితి అదుపులో ఉందని, ఆందరి పట్ల కేర్ తీసుకోమని సీఎం ఆదేశించారని మంత్రి బొత్స సత్యానారాయణ తెలిపారు. అందుకే అధికారులు, మేము ఈరోజు ఇక్కడే బస చేస్తున్నామన్నారు. అవసరమైతే మరో రెండు రోజులు ఉంటామన్నారు. గ్రామస్తులు ఇంటికి రాగానే ఇంట్లోని సామానులన్నీ శుభ్రం చేసుకోవాలన్నారు.

You might also like