FbTelugu

నాడు వద్దన్నదే.. నేడు ముద్దయిందా!

ఒడ్డు దాటిందాక ఓడ మల్లన్న.. ఒడ్డు దాటినంక బోడి మల్లన్న అన్నట్టుగా ఉంది ప్రధాని మోదీ పరిస్థితి. ప్రభుత్వ రంగంగా వద్దేవద్దు అని పట్టుబట్టిన సంస్థనే ఇప్పుడు ఆసరాగా నిలవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. విశాఖలోని ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేయాలని కేంద్రంలోని బీజేపీ సర్కారు నిర్ణయించింది.

ఇక్కడ నుంచి ఎన్ని పోరాటాలు చేసినా, ఎంతమంది దానిని ఖండించినా ససేమిరా అన్నాడు ప్రధాని మోదీ. ప్రభుత్వరంగ సంస్థ అయిన విశాఖ ఉక్కును ప్రైవేటువారికి అతి తక్కువకు అప్పగించేందుకు సిద్ధమైన కేంద్రం దానిపై నష్టాల ముద్ర వేసింది. ఆ సంస్థకు కేంద్రం నిధులేమీ ఇవ్వకపోగా ఆ సంస్థ నుంచే కోట్లాది రూపాయలను పన్నుల ద్వారా కేంద్రం వసూలు చేసింది. అయినా, దానికి నష్టాలు వస్తున్నాయని.. వాటిని భరించడం తమ వల్ల కాదని ఆరోపణలు చేస్తూ దాన్ని అమ్మకానికి పెట్టారు. ఇదంతా ఒక ఎత్తయితే.. ఇప్పుడు దేశంలో పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. తగ్గుతుందనుకున్న కరోనా మళ్లీ విజృంభిస్తోంది. సెకండ్‌వేవ్‌ కరోనా మరింత తీవ్రంగా వచ్చింది. దేశాన్ని అల్లకల్లోలం చేస్తోంది. రోజుకు రెండు లక్షలకు పైగా కరోనా బారిన పడుతున్నారు. వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మొదటి విడతలో కరోనా రోగులకు వెంటిలేటర్లు ఎక్కువ అవసరం అయితే.. సెకండ్‌వేవ్‌లో ఆక్సిజన్‌ అవసరాలు బాగా పెరిగాయి.

ఆక్సిజన్‌ అందకనే ఎక్కువమంది చనిపోతున్నారు. కానీ, ప్రభుత్వం వద్ద కావాల్సినంత ఆక్సిజన్‌ లేదు. దీంతో రాష్ట్రాలకు ఆక్సిజన్‌ సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో దేశవ్యాప్తంగా మోదీపై విమర్శలు పెరుగుతున్నాయి. మోదీ దిగిపో అంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆక్సిజన్‌ అందించడం తప్ప మోదీకి మరో గత్యంతరం లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు ఆయనకు విశాఖ ఉక్కు పరిశ్రమ. వెంటనే ఆక్సిజన్‌ ఉత్పత్తిని పెంచి రాష్ట్రాలకు సరఫరా చేయాలని పరిశ్రమను ఆదేశించారు. ఇప్పుడు దేశానికి ఆక్సిజన్‌ అందించే స్థాయిలో ఉంది. దేశానికి ఆక్సిజన్‌ అంతటి స్థాయిలో ఉన్న పరిశ్రమను అమ్మాలని చూశాడు ప్రధాని. ఇప్పుడు ఆక్సిజన్‌ అవసరం రావడంతో దానిపై ఆదేశాలు జారీ చేస్తున్నాడు. ఆ పరిశ్రమ ఇప్పటికీ ప్రభుత్వం ఆధీనంలోనే ఉంది కాబట్టి విపత్తు రాగానే ఆక్సిజన్‌ ఉత్పత్తి పెంచి దేశాన్ని ఆదుకోవాలని ఆదేశించారు. అదే పరిశ్రమ ప్రైవేటు వారి చేతిలో ఉంటే ఇలాంటి ఆదేశాలు జారీచేసే పరిస్థితి ఉంటుందా.. ఒకవేళ ప్రధాని ఆదేశించినా లాభాలు లేకుండా ఆ సంస్థలు విశాఖ ఉక్కు పరిశ్రమ నుంచి ఆక్సిజన్‌ను సరఫరా చేసేవారా అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ఆక్సిజన్‌ కొరత వల్ల ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు ఉంటే ఎంత అండగా ఉంటుందన్న విషయం విశాఖ ఉక్కు పరిశ్రమ ద్వారా అందరికీ అర్ధమైంది. మరీ ఈ విషయం ప్రధానికి అర్ధమైందో లేదో.. ఇకనైనా విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మకాన్ని ఆపుతారో లేదోనని అందరై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.