FbTelugu

ఆరేడు వేల మందికి దర్శనం: టీటీడీ ఛైర్మన్

తిరుమల: ప్రయోగాత్మక దర్శనాల పరిశీలన తరువాత ప్రతి రోజు ఆరేడు వేల మంది కన్నా ఎక్కువ మందికి దర్శనం కల్పించే అవకాశం ఉందని, ఎంత మందికి దర్శనం కల్పించేది త్వరలోనే ప్రకటిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు.

ఇవాళ శ్రీవారి దర్శనాల ప్రయోగాత్మక ప్రారంభం తరువాత టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. శ్రీవారి ప్రయోగాత్మక దర్శనాల ప్రారంభించామని, తొలి రెండు రోజులు టీటీడీ ఉద్యోగులు, 10వ తేది తిరుమల స్థానికులతో దర్శనాలకు అనుమతిచ్చామన్నారు.

క్యూ లైన్ల నిర్వహణపై అవగాహన వచ్చిన తర్వాత 11వ తేది నుండి సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తీర్థం, శఠారీ, ప్రసాదాల పంపిణీ నిలిపివేశామన్నారు. క్యూ లైన్లో భక్తులు నిబంధనలు కచ్ఛితంగా పాటించాలన్నారు. భక్తులందరూ ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకుని తిరుమలకు రావాలని ఆయన కోరారు.

కంటైన్ మెంట్ జోన్ లు, రెడ్ జోన్ లలో ఉన్నవాళ్లు, ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితులు ఉన్న రాష్ట్రాల ప్రజలు తిరుమలకు రావద్దని ఆయన కోరారు. ముందస్తు టోకెన్లు పొందిన భక్తులు మాత్రమే తిరుమల కు అనుమతిస్తామన్నారు.

సోషల్ మీడియాపై ప్రత్యేక విభాగం…

టీటీడీ పై సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని సుబ్బారెడ్డి హెచ్చరించారు. టీటీడీ ఏర్పాటు చేసిన ప్రత్యేక సైబర్ వింగ్ ద్వారా దుష్ప్రచారాలు చేసే వారిని గుర్తించి కేసులు పెడతామన్నారు. తమిళ నటుడు సూర్య తండ్రి శివకుమార్ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

టీటీడీ ఆస్తుల పై శ్వేతపత్రం విడుదల కు కసరత్తు జరుగుతోందన్నారు. టీటీడీ ఆస్తులను అమ్మేప్రసక్తే లేదని, భక్తులకు వాస్తవాలు తెలియాలనే శ్వేత పత్రం విడుదల చేస్తున్నామన్నారు. ఉద్యోగుల జీతభత్యాలకు నిధుల కొరత లేదని, ఓవర్డ్రాఫ్ట్ వెళ్ళాల్సిన పరిస్థితి లేదన్నారు. అటువంటి పరిస్థితులు రాకుండా చూసుకుంటామన్నారు.

You might also like