FbTelugu

హద్దులు మూసివేత

కరోనా దెబ్బకు హద్దులన్నీ మూతపడుతున్నాయి. హద్దులు మూత అంటే కేసీఆర్‌ చెప్పినట్టు ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి కాదు.. ప్రధాని మోదీ చెప్పినట్టు ఇతర దేశాల నుంచి మన దేశానికీ కాదు.

అనేక గ్రామాల ప్రజలు చెప్పినట్టు ఒక గ్రామానికి మరో గ్రామానికి మధ్య కూడా హద్దులు మూసేస్తున్నారు స్థానికులు. కరోనా మహమ్మారి ఎక్కడి నుంచి ఎలా వస్తుందో తెలియదు. ఇది చైనా దేశంలో పుట్టి ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకినట్టు వేరే గ్రామం నుంచి తమ గ్రామానికి కూడా పాకుతుందేమోనన్న ఆలోచనతో తెలంగాణలోని అనేక గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఇతర గ్రామాల వారు తమ గ్రామంలోకి రావద్దని.. తమ గ్రామంలోని ప్రజలు ఇతర గ్రామాలకు వెళ్లొద్దని నిబంధనలు పెట్టుకున్నారు.

అందులో భాగంగానే మంగళవారం తెల్లవారుజామునుంచే దీనిని అమలు చేస్తున్నారు. ఎవరూ లోపలకు రాకుండా.. లోపలి వారు బయటకు పోకుండా గ్రామ రహదారులను కంపచెట్లు అడ్డుపెట్టి కాపలా కాస్తున్నారు. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే గ్రామస్థాయిలో కఠిన చర్యలను అమలు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానాలు కూడా చేశాయి. ఇప్పుడు ఆ గ్రామాలను చూస్తుంటే తెలంగాణ ఉద్యమం సమయంలో చేసిన గ్రామాల మూసివేత వాతావరణం కళ్లముందు సాక్షాత్కరిస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఏది ఏమైనా కరోనా కట్టడికి ఆ గ్రామస్తులు కంకణం కట్టుకోవడం మాత్రం అభినందనీయమంటున్నారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More