FbTelugu

విజయారెడ్డి హత్య.. వెనుకంతా భూ మాఫియా?

/Vijaya-Reddys-murder--The-land-mafia-behind

అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యతో రాష్ట్రం ఉలిక్కిపడింది. ఈ హత్యపై ఒక్కొక్కరు ఒక్కో రీతిగా స్పందిస్తున్నారు. లంచం కోసం వేధించినందుకే కడుపు మండి రైతు హత్యకు పాల్పడే పరిస్థితి ఏర్పడిందని కొందరు.. ప్రభుత్వం రెవిన్యూ అధికారులపై అధికారికంగా అవినీతి ముద్ర వేయడమే కారణమని మరి కొందరు వాదిస్తున్నారు. ఈ విషయంలో కొందరు రాజకీయ పెద్దల ప్రమేయం ఉందన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. నిన్న కాంగ్రెస్ నేతలు.. ప్రస్తుత అధికార పార్టీ ప్రజా ప్రతినిధి హస్తం ఉందని ఆరోపణలు గుప్పించగా.. ఈ రోజు టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కు చెందిన మాజీ శాసన సభ్యుడే పెద్ద భూ బకాసూరుడని ప్రత్యారోపణలకు దిగారు.

కోట్ల భూమిపై కబ్జా కన్ను..

నగర శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో ఐదారు ఏళ్ల క్రితం వరకు లక్షల్లో పలికిన ఎకరం ధర ఇప్పుడు కోట్లకు చేరింది. దీంతో కొందరు దొంగ పత్రాలు సృష్టించడం రైతులను బ్లాక్ మెయిల్ చేసి కొంత మొత్తానికి సెటిల్ చేసుకోవడం పరిపాటిగా మారిందని స్థానికులు చెబుతున్నారు. కొందరు అమాయకుల దగ్గర నుంచి అయితే భూములు కూడా లాక్కున్న ఘటనలు సైతం ఉన్నాయని సమాచారం. ఇదంతా వివిధ పార్టీల్లోని పెద్దల అండదండలతోనే జరుగుతుందనేది బహిరంగ రహస్యం. ఈ క్రమంలో కొందరు నిజాయితీ గల అధికారులు, అమాయక రైతులు బలి అవుతున్నారని బాధితులు చెబుతున్నారు. కబ్జాదారులు అసలు రైతులపై దొంగ పత్రాలతో ఫిర్యాదులు చేయడం.. కోర్టులకు లాగడం.. అదే సమయంలో అధికారులపై ఉన్నత స్థాయి నుంచి ఒత్తిడి చేయడంతో వారు ఏమీ చేయలేని పరిస్థితి ఉందని సమాచారం. ఈ క్రమంలోనే అధికారులు, ‘అసలు రైతుల’ నడుమ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. ఇలాంటి నేపథ్యంలోనే తహసీల్దార్ విజయారెడ్డి హత్య జరిగిందన్న చర్చ అధికార వర్గాల్లో జోరుగా సాగుతోంది. హత్య వెనక అసలు నిజాలు తెలియాలంటే విచారణ పూర్తి అయ్యే వరకు ఆగాల్సిందే. ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ అన్ని వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది.

You might also like