FbTelugu

విజ‌యారెడ్డి హ‌త్య కేసు హుళ‌క్కేనా!

vijaya-reddy-case-would-clouse

బాధితురాలు మ‌ర‌ణించింది.. నిందితుడూ క‌నుమూశాడు. ఇక కేసు ఏముంది. రేపోమాపో.. ఫైల్ మూసివేయ‌ట‌మేనా! ఇటీవ‌ల హ‌త్య‌కు గురైన అబ్దుల్లాపూర్‌మెంట్ మండ‌ల త‌హ‌సీల్దార్ విజ‌యారెడ్డి కేసు ఎటువైపు చేరుతుంద‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సాధార‌ణ ప‌రిస్థితుల్లో.. వ్య‌క్తిగ‌త క‌క్ష‌తో ఇటువంటి దారుణం జ‌రిగి ఉంటే పెద్దగా ప‌ట్టించుకునే ప‌ని ఉండ‌దు. కానీ కోట్లాదిరూపాయ‌ల భూమాఫియా ఆడిన డ్రామాలో ఇద్ద‌రూ పావులుగా మారారు. కుటుంబానికి అవ‌స‌ర‌మైన ఆ ఇద్ద‌రూ ఇప్పుడు లోకాన్ని వీడిపోయారు. మాన‌వ‌త్వంతో స్పందించే ఎవ‌రైనా ఇలాగే భావిస్తారు. అంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా.. అస‌లు సంగ‌తి ఇప్పుడే మొద‌లైంది. భూ లావాదేవీల విష‌యంలో విజ‌యారెడ్డి నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే న‌డ‌చుకున్నార‌ని ఉన్న‌తాధికారులు చెబుతున్నారు. అస‌లు ఆ భూమి అబ్దుల్లాపూర్ మండ‌లంలోనిది కాదంటూ మ‌రో వాద‌న తెర‌మీద‌కు తెచ్చారు. అటువంటి స‌మ‌యంలో ఆమెను హ‌త్య చేయాల్సిన అవ‌స‌రం ఎవ‌రికి వ‌చ్చింది. దానికి భూ వ్య‌వ‌హారాల‌నే రంగు పులిమి ప‌క్కా ప్లాన్ ర‌చించాల్సిన అవ‌స‌రం ఎవ‌రికి ఉంది. ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల్సిన వ్య‌క్తి సురేష్‌. ఇప్పుడు అత‌డు కూడా మ‌ర‌ణించాడు. బాధితురాలు అప్పుడు క‌నుమూసింది. ఇప్పుడు కీల‌క‌మైన ఆధారాలు సేక‌రించ‌టం.. దాన్ని కోర్టులో నిల‌బ‌డేలా చేయ‌టం పోలీసుల ముందున్న స‌వాల్‌. కుటుంబ స‌భ్యులు కూడా కోర్టులు, పోలీసులంటూ తిరిగేంత‌టి సాహ‌సం చేయ‌రు. న్యాయాన్యాయాల సంగ‌తి ఎలా ఉన్నా ఈ చికాకుల‌తో ఏళ్ల‌త‌ర‌బ‌డి కోర్టుల చుట్టూ తిరిగేందుకు ఇష్ట‌ప‌డ‌రు. తెర‌వెనుక నుంచి చ‌క్రం తిప్పిన నేత‌ల‌కు కావాల్సింది కూడా ఇదే. వారు ముందుగా ఆశించి ప‌థ‌క‌ర‌చ‌న చేసిన కార‌ణంగా కూడా అదే కావ‌చ్చు. త‌హ‌సీల్దార్ హ‌త్య కోణంలో భూ మాఫియా వెనుక రాజ‌కీయ నేత‌లు ఉన్నారంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష‌న్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఇద్ద‌రూ ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. త‌హ‌సీల్దార్ హ‌త్య వెనుక కుట్ర‌దారులు ఆ ఇద్ద‌రిలో ఎవ‌ర‌నేది కూడా ప్ర‌శ్నార్ధ‌క‌మే. నిన్న‌టి వ‌ర‌కూ చేసిన ఆరోప‌ణ‌ల‌కు క‌ట్టుబ‌డిన ఇద్ద‌రూ న్యాయ‌పోరాటం చేస్తారా! అంటే కంద‌కు లేని దురద క‌త్తిపీట‌కు ఎందుకంటూ ముఖానే చెప్ప‌గ‌ల రాజ‌కీయ ఉద్దండులు. ఎటువైపు చూసినా ఈ కేసు వీగిపోయే అవ‌కాశాలున్నాయ‌నేది నిపుణుల అంచ‌నా. కాబ‌ట్టి.. మ‌ర‌ణించిన ఇద్ద‌రి ఉద్దేశాల వెనుక వాస్త‌వాలు ఏమైనా.. ఇప్ప‌టికి అవ‌న్నీ స‌స్పెన్స్‌. ఆ ఇద్ద‌రూ చ‌చ్చి బ‌తికారు.. కేసు వెనుక సూత్ర‌దారుల‌ను బ‌తికించారు.

You might also like