FbTelugu

రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీరు సరికాదు: వీహెచ్ఆర్

హైదరాబాద్: రిజర్వేషన్లు ఇంకెన్ని తరాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని అడిగిందని, ఇదేమి న్యాయమని మాజీ ఎంపీ వి.హన్మంతరావు మండిపడ్డారు. క్షేత్ర స్థాయిలో రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలు జరిగిందా లేదా అనేది తెలుసుకోకుండా ఇలా అడగడం సబబుగా లేదన్నారు.
మా పోరాటం ఫలితంగా 6 లక్షల నుంచి క్రిమిలేయర్ ను 8 లక్షలకు పెంచారని, దేశంలో పేరుకే 27శాతం ఓబీసీ రిజర్వేషన్లు తప్పితే వందశాతం అమలు కాలేదని ఆయన ఆరోపించారు. ఇవాళ గన్ పార్క్ వద్ద హన్మంతరావు మీడియాతో మాట్లాడుతూ, జనాభాలో 50శాతం ఉన్న ఓబీసీలకు 18 శాతం మాత్రమే న్యాయం జరుగుతున్నదని, 27శాతం రిజర్వేషన్లు అమలైతే ఎందుకు కొట్లాడుతామని ఆయన ప్రశ్నించారు. పది శాతం అగ్ర కులాలకు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. తమిళనాడు రాష్ట్రంలో 50శాతం పైగా రిజర్వేషన్లు అమలవుతున్నపుడు తెలంగాణలో ఎందుకు అమలవడం లేదని హన్మంతరావు కేసీఆర్ ను నిలదీశారు.

బీసీ రిజర్వేషన్ల అంశాంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించాలని, ఓబీసీలకే క్రిమిలేయర్ ఎందుకని, ఇతర వర్గాలకు కూడా వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. న్యాయ వ్యవస్థ ఓబీసీలకు అన్యాయం చేయవద్దని, దేశంలో వెంటనే కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించాలని ఆయన కోరారు. దేశంలోని సుప్రీంకోర్టు, హైకోర్టులలో జడ్జీలందరూ అగ్రకులాల వారే ఉన్నారని, మిగతా కులాల వారు చాలా స్వల్పంగా ఉన్నారన్నారు. ఓబీసీ లలో క్రిమీలేయర్ ఎత్తేస్తేనే మాకు న్యాయం జరుగుతుందని హన్మంతరావు అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.