FbTelugu

వెంకన్న అంటే భయం, భక్తి ఉంది: చెవిరెడ్డి

ఈ వేలం గత ప్రభుత్వం నిర్ణయమే

వేలం వేయాలని నివేదించింది టీడీపీ, బీజేపీ సభ్యులే

తిరుపతి: తిరుమల వెంకన్న దేవుడంటే మా ప్రభుత్వానికి భక్తి, భయం రెండూ ఉన్నాయని, మేము ఎన్నటికీ తప్పు చేయబోమని టీటీడీ పాలకమండలి సభ్యుడు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు.

తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఆదివారం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీటీడీ తమిళనాడులో విక్రయించాలని నిర్ణయించిన భూముల వేలం ప్రక్రియ గత ప్రభుత్వం నియమించిన పాలకమండలి తీసుకున్న నిర్ణయమే అని ఆయన ఆధారాలతో సహా వివరించారు. నిరర్థక భూములను అమ్మాలని నిర్ణయం తీసుకుంది టీడీపీ, బీజేపీ సభ్యులున్న పాలకమండలే అని ఆయన స్పష్టం చేశారు.  ఆనాడు నిర్ణయం తీసుకునేది మీరే.. ఈనాడు విమర్శించేది మీరేనా..? అని ఆయన నిలదీశారు.

చదలవాడ కృష్ణమూర్తి నేతృత్వంలోని పాలకమండలి టీటీడీకి సంబంధించిన ఉపయోగంలో లేని, నిర్వహణకు ఇబ్బంది అయిన 50 ఆస్తులను వేలం వేసి విక్రయించేందుకు సబ్ కమిటీని నియమించింది నిజం కాదా..?. ఆ భూములను అమ్మాలని సబ్ కమిటీ నివేదిక ఇవ్వడం, ఆ నివేదికను పాలకమండలి తీర్మానం చేసింది నిజం కాదా..? అన్నారు.

ఆ సబ్ కమిటీలో బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఈనాడు మీడియా సంస్థల ఎండీ చెరుకూరి కిరణ్ వియ్యపురాలు ఎల్లా సుచరిత సభ్యులు ఉన్నారన్నారు. దేవుణ్ణి ఇలా రాజకీయాలకు వాడుకుంటే పోతారని, ఇక మీ ఖర్మ అని చెవిరెడ్డి అన్నారు. 1974 నుంచి 2014 వరకు టీటీడీ నిరర్థక ఆస్తుల అమ్మకం ప్రక్రియ జరిగిందన్నారు. చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు కూడా 129 టీటీడీ ఆస్తులు వేలం వేసి రూ.6.39 కోట్లకు విక్రయించారన్నారు. విజయవాడలో 40 ఆలయాలు కూలదోసింది మీరు కాదా అని ఆయన నిలదీశారు.

You might also like