FbTelugu

ఓటుకు వ్యాక్సిన్‌!

ఎన్నికల్లో ఓటుకు నోటు.. మందు.. మాంసం.. ఇంకా ముందుకు పోతే బైక్‌లు, కార్లు, బంగారం, వంట సామగ్రిలాంటివి పంచడం చూశాం. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఓటుకు వ్యాక్సిన్‌ ఇస్తాం అనేదాకా వచ్చింది పరిస్థితి. ఇది వినడానికి కాస్త విచిత్రంగానే అనిపించినా నిజంగానే ఓటుకు వ్యాక్సిన్‌ ఇస్తామని ఓ పార్టీ హామీ ఇచ్చింది. ఈ ఏడాది ప్రారంభం నుంచే కొవిడ్‌ విజృంభించింది. ప్రపంచాన్నే గడగడలాడించింది. ఇంకా దాని ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. ఇండియాలో కూడా దాని ప్రభావంతో లక్షలాది మంది కరోనా బాధితులయ్యారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనాకు ఇంతవరకు ఎలాంటి వ్యాక్సిన్‌ రాలేదు. ప్రపంచ దేశాలన్నీ దానికోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రజలు కూడా దానికోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అక్కడక్కడా ఒకటి రెండు ఫార్మా కంపెనీలు తయారు చేస్తున్న వ్యాక్సిన్‌ చివరి దశలో ఉంది. మరో రెండు మూడు నెలల్లో ఇది మార్కెట్‌లోకి వస్తుందని ప్రచారం సాగుతోంది. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే బిహార్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి.

ఈ ఎన్నికల్లో లబ్ధి పొందాలంటే మందు, డబ్బులాంటివి ఎక్కువగా పనిచేయవని తెలుసుకున్న ఎన్‌డీఏ ఓ అడుగు ముందుకేసింది. జనం అంతా ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్‌ ఇస్తామంటే సరి అనుకున్నట్టున్నారు. ఎన్డీఏ మళ్లీ అధికారంలోకొస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందిస్తామని బిహార్‌ ప్రజలకు బీజేపీ హామీ ఇచ్చింది. విజన్‌ డాక్యుమెంట్‌ పేరిట కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ‘‘కరోనాపై పోరులో భారత్‌ ముందు వరుసలో ఉంది. మూడు వ్యాక్సిన్లు ప్రయోగ పరీక్షల దశలో ఉన్నాయి. ఐసీఎంఆర్‌ క్లియరెన్స్‌ ఇచ్చిన వెంటనే ఈ వ్యాక్సిన్‌ను బిహార్‌ ప్రజానీకానికి అందుబాటులో ఉంచు తాం. ఉచితంగా పంపిణీ చేస్తాం’’ అని నిర్మల చెప్పారు. కాగా, అత్యంత కీలకమైన ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇస్తామని ఓ రాజకీయ పార్టీ ప్రకటించడం ఇదే ప్రథమం. అయితే, ఈ హామీ రాజకీయంగా వివాదాస్పదమైంది. వ్యాక్సిన్‌ పేరుతో రాజకీయాలు చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ సహా విపక్షాలు భగ్గుమన్నాయి. ‘‘కొవిడ్‌ వాక్సిన్‌ ఎప్పుడు ఉచితంగా లభిస్తుందో తెలుసుకోవాలంటే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయో తెలుసుకోవాలన్నమాట..’’ అంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇలాంటి బూటకపు హామీలు ఇస్తూ పబ్బం గడుపుకోవడం బీజేపీకి అలవాటైపోయిందన్నారు. ‘‘మాకు ఓట్లేయండి, మీకు ఫ్రీగా వాక్సిన్‌ ఇస్తాం.. అని బీజేపీ చెబుతోంది.. ఎన్నికల కమిషన్‌ దీన్ని తప్పుబట్టదా?’’ అని కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ ప్రశ్నించారు.

వ్యాక్సిన్‌ను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం దారుణమని ఆర్జేడీ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ విమర్శించారు. తీవ్ర విమర్శలు చెలరేగడంతో.. బీజేపీ ఆత్మరక్షణలో పడింది. తమిళనాడులో కూడా ప్రజలకు ఉచితంగా వాక్సిన్‌ ఇస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి చేత ప్రకటన చేయించింది. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే పళనిస్వామి ప్రకటన రావడం గమనార్హం. వ్యాక్సిన్‌ సిద్ధమయ్యాక.. ప్రతి రాష్ట్రానికీ ఉచితంగా పంపిణీ చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రి అశ్వనీ చౌబే తెలిపారు. కానీ ఆయన ప్రకటనను కేంద్ర ఉన్నతస్థాయి నాయకత్వం ధ్రువీకరించాల్సి ఉంది. మొత్తానికి బీజేపీ ప్రకటన బిహార్‌ ఎన్నికల వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.