FbTelugu

రైల్వే ఉద్యోగులను ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా గుర్తించాలి

సిఎం కెసిఆర్ కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి లేఖ
న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులను “ఫ్రంట్ లైన్ సిబ్బంది”గా గుర్తించాలంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు లేఖ రాశారు.

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభించిన నేపథ్యంలో మనదేశంలో వైద్య, పారిశుద్ధ్య, పోలీసు, పారామెడికల్ తదితర విభాగాల సిబ్బంది తో పాటు రైల్వే శాఖ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తమకు తెలిసిందే. రైల్వేలు నిరంతరం రోజుకు 24 గంటలు పని చేస్తూ ఈ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రజల సౌకర్యార్థం అనేక సేవలు చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రజలను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడమే కాకుండా ముఖ్యమైన నిత్యావసర వస్తువులైన ఆహార ధాన్యాలు, పాలు, వ్యవసాయ ఉత్పత్తులతో పాటు ఎరువులు, మందులు, బొగ్గు, సిమెంటు ఇంకా పరిశ్రమలకు కావలసిన ముడిపదార్థాలను సరఫరా చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కోవిడ్ కి సంబంధించిన అత్యవసర సామగ్రి పరికరాల సరఫరాలో కూడా రైల్వేశాఖ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఆక్సిజన్ కి సంబంధించి ప్రత్యేక రైళ్లను నడపడంలో కావచ్చు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజల కోసం ప్రత్యేకంగా నడిపిన శ్రామిక్ రైళ్ల విషయంలో కావచ్చు రైల్వే శాఖ ఉద్యోగులు కోవిడ్ కష్టకాలంలో కూడా తమ ప్రాణాలను లెక్క చేయకుండా పని చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా రైల్వే ఉద్యోగులు కూడా కోవిడ్ బారిన పడటం లేదా తమకు తెలియకుండానే కోవిడ్ వ్యాప్తికి కారణం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించి దేశంలోని, ఒరిస్సా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలలో రైల్వే ఉద్యోగులను ఫ్రంట్ లైన్ సిబ్బందిగా గుర్తించి వ్యాక్సినేషన్ లో ప్రాధాన్యత ఇవ్వటానికి ఆదేశాలు కూడా జారీ చేశాయి.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ మధ్య రైల్వే కూడా రైల్వే ఉద్యోగులను ఫ్రంట్ లైన్ సిబ్బందిగా గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఇదివరకే పలుమార్లు విజ్ఞప్తి చేసింది. రైల్వే ఉద్యోగులు చేస్తున్న సేవలను గుర్తించి తెలంగాణాలో పనిచేస్తున్న రైల్వే ఉద్యోగులను కూడా ఫ్రంట్ లైన్ సిబ్బందిగా గుర్తించి వారికి ఇతర ఫ్రంట్ లైన్ సిబ్బందితో సమానంగా వ్యాక్సినేషన్ తదితర సదుపాయాలు అందుబాటు లోకి వచ్చేలా తమరు తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కిషన్ రెడ్డి ఆ లేఖ లో సిఎం కెసిఆర్ కు విజ్ఞప్తి చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.