FbTelugu

ఇప్పటికి క్లారిటీ వచ్చిందా..!

కేంద్రం తీసుకువచ్చిన రైతు బిల్లులపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. దేశవ్యాపితంగా రైతులు ఢిల్లీలో సాగిస్తున్న ఆందోళనకు నానాటికీ మద్దతు పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వామపక్షాలు, రైతుసంఘాలు భారత్‌బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణలో టీఆర్‌ఎస్‌ కూడా మద్దతు పలికింది. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ క్యాడరంతా బంద్‌ విజయవంతానికి కృషి చేశారు.

దీనిని ఓ చాలెంజింగ్‌గా తీసుకొని పార్టీలోని అన్ని శక్తులూ రోడ్డెక్కాయి. కానీ, ఈ బంద్‌కు మద్దతు పలికిన సీఎం కేసీఆర్‌ మాత్రం ఆ రోజు బంద్‌లో ఎక్కడా కనిపించలేదు. కనీసం ఎక్కడా ఆందోళనలో కూడా పాల్గొనలేదు. అసలు ఆ రోజు ఎక్కడా బయటకు రాలేదు. దీంతో చాలామందికి అనుమానం వచ్చింది. బంద్‌లో టీఆర్‌ఎస్‌ ఇంతగా పాల్గొంటుంటే ఆయన కనిపించకపోవడాన్ని విపక్షాలు కూడా ప్రశ్నించాయి. అయితే, ఆయన ఆందోళనలో పాల్గొనకపోవడం వెనుక పెద్ద కారణమే ఉంటుందని అంతా భావించారు. కానీ, ఆ కారణమేంటో మాత్రం ఎవరికీ అర్ధం కాలేదు. ఇటీవల కాలంలో కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనలో ప్రధానితో పాటు పలువురు మంత్రులు, బీజేపీ కేంద్ర నాయకులను కలిశారు. అంతే.. ఆయన వ్యవహారశైలిలో మార్పు వచ్చింది. మొదట్లో రైతు బిల్లులను వ్యతిరేకించిన కేసీఆర్‌ వాటిని సమర్ధించారు. అంతే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

అయితే, కేసీఆర్‌ రైతు బిల్లుల విషయంలో అప్పుడు ఎందుకు వ్యతిరేకించారు.. ఇప్పుడు ఎందుకు సమర్థిస్తున్నారు అన్నది వీడని ప్రశ్నగా మిగిలింది. అయితే, కేంద్రంలోని బీజేపీని వ్యతిరేకిస్తే ఏం జరుగుతుందో కేసీఆర్‌–మోదీ చర్చల సందర్భంగా కేసీఆర్‌కు బాగా తెలిసొచ్చినట్టుంది. అందుకే బీజేపీపై వ్యతిరేకతను మానుకొని దానికి అనుకూలంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీని వ్యతిరేకిస్తే ఏం జరుగుతుందో కేసీఆర్‌కు బాగా తెలుసని.. అందుకే బీజేపీకి వ్యతిరేకంగా జరిగిన భారత్‌బంద్‌లో ఆయన పాల్గొనకుండా ముందుజాగ్రత్త పడ్డారని.. ఆయన భావించినట్టే ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా వ్యవహరించాల్సి వచ్చిందంటున్నారు. ఒకవేళ ఆయన ఆందోళనలో పాల్గొని ఉంటే ఇప్పుడు బీజేపీకి దగ్గర కావడం కష్టంగా మారేదని.. అందుకే కేసీఆర్‌ ముందు జాగ్రత్తగా ఆందోళనలో పాల్గొనకుండా జాగ్రత్త పడ్డారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం అవుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.