నల్గొండ: పీఏ పల్లి మండలం అంగడిపేట స్టేజి వద్ద నాగార్జున సాగర్ – హైదరాబాద్ రహదారిలో జరిగిన జరిగిన రోడ్డు ప్రమాద ఘటన లో మృతుల సంఖ్య 9 కి చేరింది.
గురువారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఏడుగురు ఘటనా స్థలంలో చనిపోగా, చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న లింగమ్మ, అలివేలు ఉదయం మృతిచెందారు.
దేవరకొండ మండలం చింతబాయి గ్రామానికి చెందిన 21 మంది కూలీలు పీఏ పల్లి మండలం రంగారెడ్డిగూడెంలో నాట్లు వేసేందుకు ఆటోలో వెళ్లారు. పని ముగించుకుని వస్తుండగా అంగడిపేట స్టేజీ వద్ద అకస్మాత్తుగా కుడివైపునకు దూసుకువెళ్లి బొలెరో ను ఢీకొట్టింది. ఆ పక్కనే వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టడంతో సంఘటనా స్థలంలోనే ఆరుగురు ప్రాణాలు విడిచారు. రాత్రి ఒకరు చనిపోగా, తెల్లవారు జామున మరో ఇద్దరు చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 9కి పెరిగింది.
గాయపడిన వారిలో కొందరు హైదరాబాద్, దేవరకొండ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.