FbTelugu

అంత నిర్లక్ష్యమా?

కరోనా ప్రపంచాన్నే కకావికలం చేస్తోంది. దాని ధాటికి అగ్రరాజ్యాలు సైతం గజ్జున వణుకుతున్నాయి. ఆ వైరస్‌ను ఓడించేందుకు దేశాలన్నీ ఒకరకంగా యుద్ధమే చేస్తున్నాయి. అందివచ్చిన అవకాశాలన్నింటినీ జాగ్రత్తగా వినియోగించుకుంటున్నాయి. ఇటీవల కాలంలో ఇండియాలో కూడా కరోనా విశ్వరూపం చూపుతోంది. ప్రతిరోజూ వేలాదిమందికి అది సోకుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా టెస్టులు చేయడం కూడా భారంగానే మారింది. టెస్టులకు వినియోగించే కిట్లు చాలా తక్కువగా ఉండడంతో వివిధ రాష్ట్రాలు వాటిని చాలా పొదుపుగా వాడుకుంటున్నాయి. కానీ, ఏపీలో మాత్రం ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా లక్షల్లో కిట్లు వృథా అయ్యాయి. అవి కూడా బాధితుల నుంచి సేకరించిన నమూనాలతో పాటు. టెస్టులు చేయడమే కష్టంగా మారిన పరిస్థితుల్లో ఇలా సేకరించిన నమూనాలు వృథా అవుతుంటే ఎలా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏపీలో కరోనా నిర్ధారణ కోసం లక్షల సంఖ్యలో సేకరించిన నమూనాలు (స్వాబ్‌) కొరగాకుండా పోయాయి.

అనుభవం లేనివారితో హడావుడిగా సేకరించడం, ప్యాకింగ్‌ సమయంలో లోపాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు లక్షల నమూనాలు వృథా అయినట్టు తెలుస్తోంది. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు ఏం చేయాలనే విషయంపై తలలు పట్టుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని సీసీఎంబీ అధికారులు కొన్ని నమూనాలను తిప్పి పంపడంతో విషయం వెలుగు చూసింది. కొన్నిరోజుల కిందట ఒక హైకోర్టు జడ్జి, మరో ఐఏఎస్‌ అధికారి కుటుంబానికి ఆరోగ్యశాఖ కరోనా పరీక్షలు నిర్వహించింది. మొత్త 31మంది నుంచి శాంపిళ్లు సేకరించారు. వీరంతా వీఐపీ కుటుంబాలకు చెందినవారు కావడంతో నమూనాలను హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపించారు. పరిశీలించిన అధికారులు 14 శాంపిళ్లను తిప్పి పంపారు. వీటిని సరిగా సేకరించలేదని, పరీక్షించడానికి పనికిరావని, ఆ 14మంది స్వాబ్‌ మరోసారి పంపించాలని కోరారు. దీంతో రాష్ట్రంలో జరుగుతున్న పరీక్షలు, సేకరించిన స్వాబ్‌లపై అధికారులు దృష్టి పెట్టారు. సీసీఎంబీ తిప్పి పంపిన 14శాంపిళ్ల వంటివి రాష్ట్రవ్యాప్తంగా 2లక్షలకు పైన ఉంటాయని ఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేశారు. నమూనాలు పనికిరాకుండా పోయిన పరిస్థితి ఏ ఒక్క జిల్లాకో పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోను 15–20వేల శాంపిళ్ల వరకు వృథా అయినట్టు అధికారులు చెబుతున్నారు.

ప్రకాశం జిల్లాల్లోనే 27వేల శాంపిళ్లు పనికిరాకుండా పోయాయి. అయితే, ఈ విషయం గోప్యంగా ఉంచడంతో నమూనాలు ఇచ్చిన అనుమానితులు రిపోర్టుల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కొందరు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఇదిలావుంటే, నమూనాల సేకరణ, పరీక్షల నిర్వహణలో తలెత్తుతున్న లోపాలను కట్టడి చేయడంలో ఆరోగ్యశాఖ పూర్తిగా విఫలమవుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. కరోనా పరీక్షల్లో తాము టాప్‌లో ఉన్నామని, పది లక్షల మందికిపైగా కరోనా పరీక్షలు నిర్వహించిన ఘనత తమదేనని పదేపదే చెబుతున్న అధికారులు తాజాగా వెలుగు చూసిన భారీ లోపాలపై మాత్రం మౌనం వహిస్తున్నారు. అయితే, ఇప్పటికే శాంపిళ్లు ఇచ్చిన బాధితులు మాత్రం ఇవేవీ తెలియకపోవడంతో తమ రిపోర్టుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇలా శాంపిళ్లు వృథా కావడానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ సర్వత్రా వినిపిస్తోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.