FbTelugu

ఉన్మాది దాడిలో ఇద్దరి మృతి

హైదరాబాద్‌: పాతబస్తీలో ఒక ఉన్మాది చెలరేగిపోయాడు. అక్కలను చంపేందుకు ముందుగానే ప్రణాళిక రచించి అమ్మకు బాగాలేదని పిలిచి కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు.

ఈ దారుణ ఘటనలో ఇద్దరు అక్కలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని సలాలాకు చెందిన అహ్మద్ ఇస్మాయిల్ (27) మాజీ బౌన్సర్ ఉంటున్నాడు. తల్లి పుత్లీబేగంతో కలిసి ఇస్మాయిల్ నివసిస్తున్నాడు. తల్లికి ఆరోగ్యం బాగాలేదని, వెంటనే రావాలని సోదరీమణులకు సోమవారం ఫోన్ చేసి చెప్పాడు. దీంతో వారందరూ తల్లి వద్దకు వచ్చారు. ఇంటికి వచ్చిన అక్కలు రజియాబేగం, జకీరాబేగంలపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు.

ఆ తర్వాత అక్కడికి కొంత దూరంలోని నబీల్ కాలనీలో ఉంటున్న మూడో సోదరి నూరాబేగం ఇంటికి వెళ్లాడు. ఆమెపైనా కత్తితో దాడికి దిగాగా, బావ ఉమర్ అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో చేసేది లేక అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు చేరుకునే సరికి రజియా బేగం మరణించగా, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న జకీరాబేగం, నూరాబేగం, ఉమర్‌లను ఆసుపత్రికి తరలించారు. గతేడాది మార్చిలోనూ నిందితుడు తన భార్యను గొంతు కోసి చంపినట్టు పోలీసులు తెలిపారు.

నాలుగో సోదరి మల్లికాబేగంను కూడా చంపేందుకు వారింటికి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె అప్పటికే ఆసుపత్రికి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ఆదివారం ఆస్తి పంపకాల కోసం కుటుంబ సభ్యులు కలుసుకున్నారని, ఆ తర్వాతే నిందితుడు హత్యకు పథకం రచించినట్టు పోలీసులకు స్థానికులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

You might also like