FbTelugu

టీటీడీ ఆస్తుల విక్ర‌యం…

ఏపీ ప్ర‌భుత్వం మెడ‌కు చుట్టుకుంటుందా..?

టీటీడీ ఆస్తుల విక్ర‌య‌మా.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక‌టే చ‌ర్చ‌.
ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌నిక దేవాల‌యంగా పేరొందిన టీటీడీకి చెందిన ఆస్తులు విక్ర‌యించాల్సిన అవ‌స‌రం ఏముంది..? స‌గ‌టు భ‌క్తుల ఆలోచ‌న‌. మ‌రి నిజంగా ఆస్తులు విక్ర‌యించి టీటీడీ సొమ్ము చేసుకోవ‌డం ద్వారా వ‌చ్చే లాభ‌మేమిటి అని భ‌క్తులు ప్ర‌శ్నిస్తున్నారు. టీటీడీ తీసుకున్న నిర్ణ‌యంపై అటు రాజ‌కీయ ప‌క్షాలు, ఇటు సాధార‌ణ భ‌క్తులు మండి ప‌డుతున్నారు. నిరర్థ‌క ఆస్తుల జాబితా పేరుతో 23 ర‌కాల ఆస్తుల విక్ర‌యానికి టీటీడీ సిద్ధ‌మౌంది. దీని ద్వారా టీటీడీ రూ.23 కోట్ల ఆదాయం రానుంది. వీటికితోడు రానున్న రోజుల్లో ఏపీ, తెలంగాణలోని మ‌రికొన్ని ఆస్తులు విక్ర‌యించి రూ.100కోట్లు ఆర్జించాల‌ని టీటీడీ భావిస్తోంది.
అస‌లు ఉన్న‌ప‌ళంగా టీటీడీ ఆస్తులు విక్ర‌యించాల్సిన అవ‌స‌రం ఏమొచ్చిందంటే ఎక్క‌డా స‌మాధానం దొర‌క‌డం లేదు. ఎందుకంటే నిరర్థ‌కంగా ప‌డి ఉన్నాయ‌నే చెబుతోంది గానీ వాటివ‌ల్ల వ‌చ్చిన న‌ష్ట‌మేమీ లేదు. ఆస్తులను కాపాడుకోవ‌డం ఇబ్బందిక‌రంగా మారింద‌ని టీటీడీ చెబుతోంది. స్థ‌లాల‌కు కంచె వంటివి వేయ‌డం లేదా లీజుకు ఇవ్వ‌డం చేస్తే స‌రిపోతుంది గానీ ఏకంగా అమ్మాల‌ని భావిస్తుండ‌టంపై భ‌క్తులు మండిప‌డుతున్నారు.

ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం అటు తిరిగి, ఇటు తిరిగి ఏపీ ప్ర‌భుత్వం మెడ‌కు చుట్టుకునేలా క‌నిపిస్తోంది. జ‌గ‌న్‌కు స్వ‌యానా చిన్నాన్న అయిన వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మ‌న్‌గా ఉండి ఆస్తుల విక్ర‌యానికి నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ఏపీ ప్ర‌భుత్వం క‌నుస‌న్న‌ల్లోనే వ్య‌వహారం న‌డుస్తోంద‌నన్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. టీటీడీ ఆస్తులు కొల్ల‌గొట్టేందుకు ప్ర‌భుత్వం ప్లాన్ వేసింద‌ని ఆరోపిస్తున్నారు.

టీటీడీకి వైవీ సుబ్బారెడ్డి చైర్మ‌న్ అయిన‌ప్ప‌ట్నుంచి ఏదో వివాదం ముసురుతూనే ఉంది. తొలుత సుబ్బారెడ్డి మతం విష‌యంలో ఆరోప‌ణ‌ల వ‌చ్చాయి. త‌ర్వాత న‌టుడు పృధ్వీ వేసిని వెకిలిచేష్ట‌ల కార‌ణంగా, అత‌నికి పద‌వి ఇచ్చినందుకు ఏపీ ప్ర‌‌భుత్వం నాలుక క‌రుచుకుంది. ఇప్పుడు ఆస్తుల విక్ర‌యం విష‌యం వివాద‌స్పదంగా మారింది. అంత ఆస్తి ఉన్న టీటీడీకే స్థ‌లాల‌ను కాపాడుకోవ‌డానికి కూడా చేత‌కావ‌డం లేదా అని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. పైగా ఆస్తుల‌న్నీ కూడా భ‌క్తులు ఎంతో ప్రేమ‌గా, భ‌క్తితో శ్రీ‌వారికి కానుక‌లుగా స‌మ‌ర్పించిన‌వి. అవి వారి గుర్తులుగా ఉంటాయ‌న్న ఉద్దేశంతో భ‌క్తులు ఇచ్చారు. ఇప్పుడు వాటిని విక్ర‌యించ‌డ‌మంటే వారి మ‌నోభావాల‌ను దెబ్బ‌తీయ‌డమేన‌ని తోటి భ‌క్తులు ఆరోపిస్తున్నారు.

పంచాయ‌తీ కార్యాల‌యాల‌కు రంగుల విష‌యం, ఐపీఎస్ అధికారి, మాజీ ఇంటెలీజెన్స్ చీఫ్ ఏబీ వెంక‌టేశ్వ‌ర రావు స‌స్పెన్ష‌న్ వ్య‌వ‌హారం, నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ఱావు స‌స్పెన్ష‌‌న్ విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ‌లు తగిలాయి. ఇప్పుడు టీటీడీ ఆస్తుల విక్ర‌యం కూడా ఏపీ ప్ర‌భుత్వం క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతోంద‌న్న అపవాదు కారణంగా ఎవ‌రైనా కోర్టుకు వెళితే మ‌ళ్లీ ప్ర‌భుత్వానికే చెడ్డ‌పేరు వ‌స్తుంద‌ని వైసీపీ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.