FbTelugu

టీఆర్‌స్‌కు ఇది చావో రేవో!

తెలంగాణలో ఇప్పుడు టీఆర్‌ఎస్‌ పరిస్థితి చావోరేవో అన్నట్టుగా తయారైంది. ఇప్పటికిప్పుడు ఆ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయే పరిస్థితులు లేకున్నా.. అలాంటి పరిణామాలకు దారితీసే పరిస్థితులు అయితే వచ్చాయన్న అభిప్రాయాన్ని రాజకీయ పండితులు వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తన సిట్టింగ్‌ స్థానంలో ఓడిపోయింది. బీజేపీ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ ఫలితంతో రాష్ట్ర ప్రజలే కాదు.. టీఆర్‌ఎస్‌ అగ్రనాయకత్వం కూడా నోరెల్లబెట్టింది. అయితే, బీజేపీ మాత్రం కేసీఆర్‌కు దిమ్మదిరిగే షాక్‌ ఇదొక్కటే కాదు.. త్వరలో మరింత దిమ్మ దిరిగేలా చేస్తామని చెబుతోంది. అదే, హైదరాబాద్‌ నగర పాలక సంస్థ ఎన్నికలు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి గోల్కొండ కోటపై తమ జెండాను ఎగురవేస్తామని ఢంకా బజాయించి చెబుతోంది. ఇదే టీఆర్‌ఎస్‌ నేతలకు నిద్ర పట్టకుండా చేస్తోంది. దుబ్బాకలో కూడా తమదే గెలుపని బీజేపీ చెబుతూ వచ్చింది.

కానీ, వారి మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయినా, చెప్పినట్టుగానే బీజేపీ విజయం సాధించింది. టీఆర్‌ఎస్‌ నేతలు పైకి ఎన్ని మాటలు చెబుతున్నా.. మళ్లీ కారు జోరు కొనసాగుతుందని బయటకు చెబుతున్నా.. ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ చెప్పినట్టే జరుగుతుందా అన్న అనుమానాలు టీఆర్‌ఎస్‌ నేతల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే తమతో బీజేపీ ఢీ అంటే ఢీ అనే స్థాయికి వచ్చింది. దుబ్బాక ఫలితంతో బీజేపీకి ప్రజా మద్దతు పెరిగిందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో హైదరాబాద్‌ నగరపాలక సంస్థ ఎన్నికలే వచ్చే శాసనసభ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని గులాబీ నేతలు భావిస్తున్నారు.

ఈ ఎన్నికల్లో ఓడిపోతే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పరాభవం తప్పదని టీఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నారట. అందుకే ఎంత కష్టపడయినా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిచి రేపటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ఇప్పటినుంచే రకరకాల ప్రణాళికలను గులాబీ నేతలు తయారు చేస్తున్నారట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం పీఠం మాదంటే మాదని బీజేపీ, టీఆర్‌ఎస్‌లు చెబుతున్నాయి. అయితే, అసెంబ్లీని ఎవరు గెలవాలన్నా వారికి జీహెచ్‌ఎంసీ ఎన్నికలే కీలకం కావడంతో ఈ రెండు పార్టీలకు ఇది చావో రేవో అన్నట్టుగా తయారయ్యాయి. అయితే, ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచి గట్టెక్కుతారో చూడాలి మరి.

You might also like

Leave A Reply

Your email address will not be published.