FbTelugu

రేవంత్ పై టీఆర్ఎస్ నేత ప్రశంసలు

హైదరాబాద్: మల్కాజిగిరి ఎంపీ ఏ.రేవంత్ రెడ్డిని టీఆర్ఎస్ నాయకుడు, మండలి మాజీ ఛైర్ పర్సన్ కె.స్వామి గౌడ్ పొగడ్తలతో ముంచెత్తారు. స్వామి గౌడ్ చేసిన సంచలన వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారాయి.

ఆదివారం సికింద్రాబాద్ బోయిన్ పల్లి లో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వామిగౌడ్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి పుట్టింది రెడ్డి కులంలో అయినా బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటున్నాడు. ఈ వర్గాలకు అండగా నలబడుతున్న నాయకులను మనం గుర్తించాలని స్వామిగౌడ్ కోరారు. మనం తెల్ల బట్టల వారికి అమ్ముడుపోవద్దని సూచించారు. ఒక పార్టీ రూ.2500 కోట్లు ఉన్న వ్యక్తిని నిల్చోబెడితే, మరో పార్టీ రూ.3500 కోట్లు ఉన్నవాడిని నిలబెడుతోందన్నారు.
ఒక పార్టీ పది మందిని చంపినోడిని పెడితే మరో పార్టీ ఇరవై మందిని చంపిన వాడిని పోటీకి దించుతుందన్నారు. ఇలాంటి భ్రష్టు రాజకీయాలను ప్రజలు గమనంచి, చైతన్యవంతులు కావాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. తనను ఓడించడానికి అధికార పార్టీ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అవే వ్యాఖ్యలు స్వామిగౌడ్ మాట్లాడ్డంతో టీఆర్ఎస్ లో హాట్ టాపిక్ అయ్యింది.

You might also like