ఇటీవల వరుస ఎన్నికల తర్వాత టీఆర్ఎస్లో మార్పు వచ్చిందా..? ఏదైనా నిర్ణయం తీసుకునేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయాలనే నిర్ణయం తీసుకుంటున్నారా..? అవసరమైతే ఒక మెట్టు దిగైనా బీజేపీని నిలువరించాలన్న ఆలోచనలో ఉన్నారా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
ఇటీవల కాలంలో జరిగిన దుబ్బాక అసెంబ్లీ స్థానానికి, జీహెచ్ఎంసీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో జోరుమీదున్న టీఆర్ఎస్ ఒక్కసారిగా నేలమీదకు దిగొచ్చింది. వరుస ఓటములతో మైండ్‌బ్లాంక్ అయింది. దీంతో దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నాయన్న ప్రచారం ఊపందుకుంది. గతంలో టీఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్‌లు ఎవరితోనూ సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకునేవారని ప్రచారంలో ఉండేది. దుబ్బాక ఎన్నికలో కూడా అదే జరిగింది. వాస్తవానికి అక్కడి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సోలిపేట రామలింగారెడ్డి కుటుంబపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, ఆ కుటుంబానికి టికెట్ ఇవ్వవద్దని నెత్తీనోరు బాదుకున్నారు. కానీ, వారి మాటను కాదని రామలింగారెడ్డి భార్యకు టికెట్ ఇచ్చి చేతులు కాల్చుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా స్థానిక నేతలను కాదని టికెట్లు ఇచ్చారు.
సిట్టింగ్ కార్పొరేటర్లపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నాయని కొందరు నాయకులు చెప్పినా వినకుండా తిరిగి వారికే టికెట్లు ఇచ్చారు. కేవలం కొద్ది స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మార్చారు. కానీ, ఫలితాలు వచ్చేసరికి ఏకపక్షంగా నిర్ణయించిన అభ్యర్థులంతా ఓడిపోయారు. సిట్టింగ్ స్థానాల్లో ఉన్న వారు ఓటమి పాలు కాగా, కొత్తవారికి టికెట్లు ఇచ్చిన స్థానాల్లో మాత్రం విజయం సాధించారు. ఈ రెండు ఎన్నికల్లో జరిగిన పొరపాట్ల నుంచి కేసీఆర్ గుణపాఠం నేర్చుకున్నారని, ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ, సాగర్ ఉప ఎన్నికల్లో అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడుతున్నారని ఆ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో కూడా అధికారికంగా అభ్యర్థులను ప్రకటించలేదు. అభ్యర్థుల ఎంపిక కోసం నాయకుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారని సమాచారం. సాగర్ అభ్యర్థిని కూడా ఇంతవరకు ప్రకటించలేదు. ప్రతిసారీ అభ్యర్థులను అందరికంటే ముందుగానే ప్రకటించే టీఆర్ఎస్ ఈ సారి ఆ సంప్రదాయాన్ని వదిలేసింది.
వాస్తవానికి టీఆర్ఎస్ నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యుల్లో ఒకరికి టికెట్ ఇవ్వాలి. కానీ, దుబ్బాక ఫలితాన్ని చూసిన తర్వాత కాస్త వెనుకా ముందాడుతోంది. ఇక్కడ జానారెడ్డి లాంటి గట్టి పిండాన్ని ఎదుర్కొనే సామర్థ్యం కలిగిన అభ్యర్థి కోసం చూస్తున్నారు. అందుకోసం కార్యకర్తల అభిప్రాయాలను తీసుకోవడం కోసం ఇప్పటికే రెండు మూడుసార్లు సమావేశాలు కూడా నిర్వహించారు. నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి స్థానిక నాయకుల అభిప్రాయాలను తీసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇక, నల్లగొండ–ఖమ్మం–వరంగల్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తిరిగి పోటీ చేస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నా ఇంతవరకు పార్టీపరంగా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఇక, రంగారెడ్డి–హైదరాబాద్–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్ఎస్ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు.
ప్రస్తుతం ఈ స్థానం నుంచి బీజేపీ నేత రామచందర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తిరిగి ఆయనకే టికెట్ కన్పామ్ అయినట్టు బీజేపీ ప్రకటించింది. దీంతో ఆయన ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. ఇదే స్థానం నుంచి గతంలో విజయం సాధించి ఎమ్మెల్సీగా పనిచేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ తిరిగి ఈసారి ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగుతున్నారు. చాపకింద నీరులా ఆయన కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే, టీఆర్ఎస్ మాత్రం దీనిని కనీసంగా పట్టించుకోవడం లేదు. పైగా ఇక్కడ పోటీచేసి ఓట్లు చీలిస్తే బీజేపీకి లాభం చేకూరుతుందన్న ఆలోచనకు టీఆర్ఎస్ నేతలు వచ్చినట్టు సమాచారం. పోటీచేసి ఓడిపోవడంతో పాటు పరోక్షంగా బీజేపీ విజయానికి సహకరించినట్టు అవుతుందేమోనన్న అనుమానం కూడా వారిలో వచ్చినట్టుంది. అందుకే దీనిపై కేసీఆర్ ఆచితూచి అడుగులేస్తున్నారు. ఒక దశలో ఇక్కడ పోటీ చేయడం కంటే బలమైన అభ్యర్థి అయిన ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతున్న నాగేశ్వర్‌కు మద్దతు ఇస్తే ఎలా ఉంటుందా అని కూడా గులాబీ నేతలు ఆలోచిస్తున్నారని ఆ పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. మొత్తానికి తమకు తిరుగులేదని ఇప్పటివరకు విర్రవీగిన టీఆర్ఎస్ ఇక నుంచి ఏ నిర్ణయాలైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితికి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.