FbTelugu

దుబ్బాకపై ట్రబుల్‌ షూటర్‌ నజర్‌

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంపై ట్రబుల్‌ షూటర్‌గా పేరుపొందిన తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు నజర్‌ పెట్టారు. ఇటీవల కాలంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక జరగనుంది.

ఈ ఎన్నికలో మళ్లీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం కోసం ఆయన పావులు కదుపుతున్నారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఆయన దుబ్బాక ఎన్నికలకు సిద్ధమయ్యారు. రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకు మళ్లీ టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇస్తే అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేయాలని నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన టీఆర్‌ఎస్‌కు చెందిన మెజారిటీ నాయకులు ఇటీవల కాలంలో సమావేశాలు నిర్వహించుకొని తీర్మానం చేసినట్టు ప్రచారం సాగింది. దీంతోపాటు ఈ ఎన్నికను కాంగ్రెస్, బీజేపీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

ఈ పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తలు అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేస్తే టీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదని భావించిన కేసీఆర్‌.. హరీష్‌ను రంగంలోకి దించినట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పటివరకు హరీష్‌కు అప్పగించిన పనులన్నీ విజయవంతం చేశారన్న పేరుంది. ఇప్పుడు దుబ్బాక పరిస్థితి కూడా కఠినంగా తయారు కావడంతో హరీష్‌ను రంగంలోకి దించినట్టు సమాచారం. సీఎం కేసీఆర్‌ పని అప్పగించిన వెంటనే హరీష్‌ రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో పార్టీ నేతలతో మాట్లాడడంతో పాటు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా అనేక అభివృద్ధి పనులను కూడా చేపడుతున్నారు.

ఒకవైపు పార్టీ నాయకులను సమన్వయం చేసుకుంటూనే ఓటర్ల మనసును కొల్లగొట్టేలా చర్యలు మొదలు పెట్టారని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో ఎలాగైనా టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని, కాంగ్రెస్, బీజేపీలకు విజయావకాశాలు లేకుండా చేసేందుకు హరీష్‌ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారట. మరి ఆయన ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో తేలాలంటే ఎన్నికల దాకా ఆగాల్సిందే మరి.

You might also like