FbTelugu

రోగులు పెరిగితే వైద్యం కష్టం: ఈటల

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణ పట్ల ప్రభుత్వాలు ఎంత ప్రచారం చేసినా కొంత మంది ప్రజల్లో భయాందోళనలు మాత్రం తగ్గడం లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

హోమ్ క్వారంటైన్ లో ఉండేందుకు కేంద్రం అనుమతి ఇచ్చినా ప్రజల్లో ఉన్న భయం వారిని హాస్పిటల్ నుండి బయటకి రానివ్వడం లేదన్నారు. చిన్న ఇల్లు ఉన్న వారు, ఇంట్లో ప్రత్యేక గది వసతి లేని వారు హాస్పిటల్ లోనే ఉండాలని కోరుకుంటున్నారు. మరోపక్క పాజిటివ్ పేషంట్ ఇంటి పక్కన ఉంటే తమకు వైరస్ సోకుతుందేమో అని భయం ప్రజల్లో ఉండడం వల్ల చాలామంది హోమ్ క్వారంటైన్ లో ఉండే వారిని ఇబ్బంది పెడుతున్నారని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.

జియగూడలో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుందని తెలిపారు. శివ చరణ్ అనే వ్యక్తి కుటుంబంలో ముగ్గురికి వైరస్ సోకడంతో ఇంట్లోనే ఉండేందుకు నిర్ణయించుకున్నారు. కానీ కాలనీలో పక్కన వారు ఇబ్బంది పెట్టడంతో తప్పని సరి పరిస్థితుల్లో హాస్పిటల్ కి రావాల్సి వచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితుల వల్ల హాస్పిటల్స్ మీద భారం పెరుగుతుందని మంత్రి అన్నారు. రోజు రోజుకి హాస్పిటల్స్ లో ఉండే వారి సంఖ్య పెరిగితే మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిబందనల మేరకు తక్కువ లక్షణాలు ఉన్న, లక్షణాలు లేకుండా ఉన్న పాజిటివ్ పేషెంట్లను ఇంట్లో ఉంచి చికిత్స అందించడానికి ప్రజలు, సమాజం సహకరించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. జీవనోపాది కోల్పోకూడదు అని మాత్రమే లాక్ డౌన్ ని ఎత్తి వేయడం జరిగిందన్నారు. ప్రజలు అవసరం లేకున్నా బయటికి వచ్చి ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని మంత్రి ఈటల రాజేందర్ కోరారు. లాక్ డౌన్ సడలించడం వల్ల ప్రజలు ఎక్కువ మంది బయటకి రావడం తో వైరస్ వ్యాప్తి పెరిగింది. వయసు మీదపడినవారికి, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి కరోనా సోకితే మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. కాబట్టి ప్రజలు కరోనా సోకకుండా ఉండే జాగ్రత్తలు పాటించాలని మరోసారి కోరారు. మరణాలు తగ్గించడానికి కృషి చేస్తున్నామని భూమి మీద ఏ మందు ఉన్న తెచ్చి చికిత్స అందిస్తామని అన్నారు.

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపద్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలోనే జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, చికిత్స చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. జిల్లా కేంద్రంలోనే ఐసోలేషన్ లో ఉంచేలాగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశానికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ గంగాధర్, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజరావ్ హాజరయ్యారు.

You might also like