FbTelugu

అమ్మో రైలా..?

ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఇప్పటివరకు బస్సుకు బదులుగా రైలును ఎంచుకుంటున్నారు. కారణం ఏంటంటే బస్సుచార్జీల కన్నా రైలు చార్జీలు తక్కువగా ఉంటాయి. దీనికితోడు ప్రయాణం కూడా చాలా సులువుగా, స్పీడుగా ఉంటుంది. కానీ, ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చేలా ఉంది. దానికి ప్రధాన కారణం కేంద్రం అమలు చేస్తున్న విధానమే. ఇప్పటి వరకు ప్రభుత్వ రంగంలోనే రైళ్లు నడిచేవి. కానీ, ఇప్పుడు రైళ్లను కూడా ప్రైవేటు పరం చేస్తున్నారు. పైగా వాటి చార్జీలను కూడా ఆ సంస్థలే నిర్ణయించుకునే వీలు కల్పించారు. దీంతో రైలు చార్జీలు భారీగా పెరిగే ప్రమాదముందని రైలు ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇక రైలు చార్జీలు కూడా విమాన చార్జీల్లాగే ఉండే అవకాశముందని భయపడుతున్నారు. విమానచార్జీలు కూడా రోజూ ఒకే పద్ధతిలో ఉండవు. ప్రయాణికుల రద్దీని బట్టి వాటిలో హెచ్చుతగ్గులు ఉంటాయి. రోజులు కాదు.. ట్రిప్పుల్లో కూడా చార్జీల వసూలులో తేడా ఉంటుంది. దీంతో ఎప్పుడు విమానం చార్జీ ఎంత ఉందో చూసుకొని టికెట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు రైళ్లను కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో పాటు చార్జీల నిర్ణయం కూడా వారికే కట్టబెడితే రైలు చార్జీలు కూడా భారీగా పెరగడంతో పాటు విమాన చార్జీల్లాగే ప్రయాణికుల రద్దీని బట్టి చార్జీల్లో తేడాలుండేలా ప్రైవేటు సంస్థలు నిర్ణయం తీసుకుంటాయేమోనన్న అనుమానం కూడా రైల్వే ప్రయాణికుల్లో కలుగుతోంది.

రైల్వేబోర్డు చైర్మన్‌ ప్రకటనపై విమర్శలు

ప్రైవేట్‌ రైళ్లలో చార్జీలు వారి ఇష్టమని, వారు ఎంతైనా వసూలు చేసుకోవచ్చని, దేశంలోని 1050 స్టేషన్లలో విమానాశ్రయాల తరహాలో యూజర్‌ చార్జీలనూ వసూలు చేస్తారని రైల్వేబోర్డు చైర్మన్‌ వీకే యాదవ్‌ చేసిన ప్రకటనపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. అన్ని రంగాలనూ ప్రైవేటు వ్యక్తులకు అప్పజెపితే ఇక ప్రభుత్వాలు ఎందుకని, ప్రభుత్వాలకు తాము పన్నులు ఎందుకు చెల్లించాలని రైలు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ప్రజల సౌకర్యాలను పట్టించుకోకుండా కేవలం కొంతమంది ప్రైవేటు వ్యక్తుల కోసమే పనిచేస్తున్నాయని, అందులో భాగమే ఈ ప్రైవేటీకరణ మంత్రం అన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

రైల్వేరంగంపైనా మోడీ కన్ను

మన దేశంలో దశాబ్దాలుగా సాధారణ ప్రయాణికుడికి అన్నివిధాలుగా అండగా ఉన్న రైలు ప్రయాణం ఇక మీదట భారం కానుంది. అన్ని రంగాలనూ ప్రైవేటు, కార్పొరేట్‌ వ్యక్తులకు కట్టబెడుతున్న కేంద్రంలోని మోడీ సర్కార్‌ కన్ను రైల్వే రంగంపై కూడా పడింది. భారత ప్రభుత్వ రైల్వేను ప్రైవేటుపరం చేసే చర్యల్లో భాగంగా పలు మార్గాల్లోని రైలు సర్వీసులను ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పనున్నది. ఆయా రైళ్లలో ప్యాసెంజర్‌ చార్జీలను నిర్ణయించే అధికారం ఆయా కంపెనీలకే కేంద్రం తాజాగా కట్టబెట్టింది. దీనికి సంబంధించి రైల్వే బోర్డు చైర్మన్‌ వీకే యాదవ్‌ మాట్లాడుతూ చార్జీలను తమ సొంతంగా నిర్ణయించే స్వేచ్ఛ ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చామని పేర్కొన్నారు. ఆయా మార్గాల్లో ఏసీ బస్సులు, విమానాలు కూడా ఆపరేట్‌ అవుతాయనీ, చార్జీలను నిర్ణయించే ముందు ఈవిషయాన్ని దష్టిలో పెట్టుకోవాలని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.