FbTelugu

రైలు కూత.. ఆ తేదీ త‌ర్వాతే!

ప్ర‌జారవాణా విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం అత్యంత ముఖ్య‌మైన నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. జూన్ 30 వ‌ర‌కు ప్ర‌జా ర‌వాణాను పున‌రుద్ధ‌రించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించింది.

ఈ విష‌యంలో రైల్వే శాఖ‌కు ఆదేశాలు ఇవ్వ‌డంతో దానికి త‌గ్గ‌ట్టుగా రైల్వే శాఖ సైతం ఏర్పాట్లు ప్రారంభించింది. జూన్ 30 వ‌ర‌కు జ‌రిగిన అన్ని బుకింగ్‌ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి ప్ర‌యాణికుల‌కు రీఫండ్ పూర్తిగా రిట‌ర్న్ ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌క‌ట‌న దృష్ట్యా జూన్ 30 వ‌ర‌కు ప్ర‌జా రవాణా అందుబాటులోకి రావ‌డం దాదాపు అసాధ్య‌మ‌నే తెలుస్తోంది. ప్ర‌జా రవాణా పెద్ద ఎత్తున ఒకేసారి అందుబాటులోకి తీసుకురాకుండా ద‌శ‌ల వారీగా అందుబాటులోకి తీసుకురావాల‌న్న ఉద్దేశంతో కేంద్రం ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది.

కానీ ఇదే స‌మ‌యంలో ఈ నెల 18 నుంచి లాక్‌డౌన్-4 అమ‌ల్లోకి రానుంది. ఇందులో ర‌వాణా ప‌రంగా కొన్ని వెసులుబాట్లు క‌ల్పించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ముఖ్యంగా గ్రీన్‌, ఆరెంజ్ జోన్ల‌లో ర‌వాణాకు వెసులు బాటు క‌ల్పించ‌నుంది. ప‌రిమిత సంఖ్య‌లో బ‌స్సులు తిప్పుకొనేలా వెసులుబాట్లు ఇవ్వ‌నుంది. దీనికి త‌గ్గ‌ట్టుగా తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాట్లు సూతం జ‌రుగుతున్నాయి. గతంలో నాలుగు వ‌రుసల సీట్లు ఉన్న సూప‌ర్‌ల‌గ్గ‌రీ బ‌స్సుల‌లో సీట్ల వ‌రుస‌ల‌ను మూడుకు కుదించారు. బ‌స్సులో రెండువైపులా రెండు, మ‌ద్య‌లో మ‌రో వ‌రుస‌తో సీట్లు ఏర్పాటు చేశారు. ఈ బ‌స్సుల‌ను రాష్ట్రాల మ‌ధ్య కాకుండా సొంత రాష్ట్రంలోనే జిల్లాల మ‌ధ్య తిప్పుతారు. ఒక రాష్ట్రం నుంచి మ‌రొక రాష్ట్రానికి వెళ్లేందుకు ప‌క్క రాష్ట్రం అనుమ‌తించే వీల్లేక‌పోవ‌డంతో సొంత రాష్ట్రంలోనే తిప్పేలా ప్లాన్ చేస్తున్నారు.

అలాగే ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం దేశ‌వ్యాప్తంగా ఉన్న వ‌ల‌స కూలీల‌ను స్వ‌స్థ‌లాల‌కు పంపించేందుకు శ్రామిక్ రైళ్లు న‌డుపుతోంది. వీటికితోడు ఢిల్లీ కేంద్రంగా మొద‌లై దేశంలోని వేర్వేరు స్టేష‌న్ల‌కు ప్ర‌త్యేక రైళ్లు న‌డుపుతోంది. ఈ రైళ్ల‌లో కేవ‌లం ఏసీ బోగీలు మాత్ర‌మే ఉంటాయి. వీటిని మాత్రం జూన్ 30 వ‌ర‌కు తిప్పాల‌ని రైల్వే శాఖ నిర్ణ‌యించింది. ఈ రైళ్ల సంఖ్య సైతం ఈ నెల 18తర్వాత పెంచే యోచ‌న‌లో రైల్వే శాఖ ఉంది. ఒక రాష్ట్రం నుంచి మ‌రొక రాష్ట్రానికి మ‌ధ్య ఉన్న ప్ర‌ధాన స్టేష‌న్ల మ‌ధ్య స్పెష‌ల్ రైళ్ల‌ను తిప్ప‌నుంది. రెగ్యుల‌ర్ రైళ్లు మాత్రం ఇప్ప‌ట్టో అందుబాటులోకి రావు. ముఖ్యంగా ప్యాసింజ‌ర్ రైళ్లు మాత్రం జూన్ 30 వ‌ర‌కు ప‌ట్టాలెక్కే ప‌రిస్థితి ఉండ‌దు. ప్యాసింజ‌ర్ రైళ్ల‌లో జ‌న‌ర‌ల్ బోగీలు ఎక్కువ‌. వీటిల్లో ప్ర‌యాణికుల మ‌ధ్య భౌతికదూరం పాటించేలా చేయ‌డం సాధ్య‌మయ్యే ప‌ని కాదు. దీనివ‌ల్ల ఎవ‌రికైనా క‌రోనావైర‌స్ సోకితే బోగిలో ఉన్న వారంద‌రికీ సోకి.. వారి ద్వారా సామాజిక వ్యాప్తికి కార‌ణ‌మ‌వుతుంది. అందుకే ప్యాసింజ‌ర్ రైళ్ల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో తిప్ప‌వ‌ద్ద‌ని రైల్వే శాఖ నిర్ణ‌యించింది.

You might also like