FbTelugu

రైతు ఉద్యమంలో విషాదం

కారులోనే ఆహుతైన మెకానిక్

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమంలో విషాదం చోటు చేసుకున్నది. రైతులకు సహాయం చేసేందుకు వెళ్లిన మెకానిక్ కారులోనే అగ్నికి ఆహుతి కావడం రైతులకు కన్నీరు తెప్పించింది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పంజాబ్ కు చెందిన జనక్ రాజ్ (55) రైతుల ట్రాక్టర్లకు ఏమైనా రిపేర్లు వస్తే సరి చేసేందుకు స్వచ్ఛందంగా బయలుదేరాడు. ఢిల్లీ-హర్యాణ సరిహద్దు బహదూర్ ఘర్ ప్రాంతంలో పోలీసులు అడ్డుకోవడంతో రైతులతో పాటు అతనూ నిలిచిపోయాడు. శనివారం రాత్రి కొన్ని ట్రాక్టర్లకు రిపేరు చేసిన తరువాత అలసిన అతను తన కారులోనే నిద్రపోయాడు. ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో జనక్ రాజ్ కారులోనే అగ్నికి ఆహుతి అయ్యాడు.

ఈ ఘటనపై అక్కడే ఉన్న రైతులు చలించిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని తరలించి కేసు నమోదు చేశారు. జనక్ రాజ్ మృతిపై మాజీ కేంద్ర మంత్రి హర్ సిమ్రన్ కౌర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైతు ఉద్యమ చరిత్రలో జనక్ రాజ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆమె కీర్తించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.