హైదరాబాద్: సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియచేసేందుకు టాలీవుడ్ పెద్దలు సీఎం జగన్ రెడ్డిని ఈ నెల 9న న కలవనున్నారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మధ్యాహ్నం జగన్ ను కలిసి తమ సమస్యలు వివరించనున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశామని, 9న జగన్ ను కలుస్తున్నామని నిర్మాత సీ.కళ్యాణ్ తెలిపారు.
లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ నిర్వహించుకునేందుకు అనుమతించాలని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళిన విషయం తెలిసిందే. ఇప్పుడు జగన్‌తోను కీలక విషయాలపై చర్చలు జరపనున్నట్టు తెలుస్తుంది. ఈ మీటింగ్‌కి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ను ఆహ్వానించగా బర్త్ డే కారణంగా రాలేకపోతున్నట్లు చెప్పారు.
కరోనా వైరస్ ప్రభావంతో గడచిన 70 రోజులుగా షూటింగ్ లు పూర్తిగా నిలిచిపోయాయి. సినీ పరిశ్రమకు కోలుకోని విధంగా దెబ్బ తగిలింది. యాక్టర్లు, ఆర్టిస్టులు, నిర్మాతలు, పంపిణీదారులు, సినిమా హాలు యజమానులు ఇబ్బందులు పడుతున్నారు.