FbTelugu

భరతజాతి ముద్దుబిడ్డ మోక్షగుండం

నేడు ఇంజినీర్స్ డే

భారత జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య. ఇంజినీర్‌గా మన దేశ ఖ్యాతిని నలు దిక్కులకు చాటారు. ఈ రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించారు. ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాలను ఆవిష్కరించారు. నేటికీ అవి చెక్కుచెదరలేదంటే అతిశయోక్తి కాదు. భారత్‌లో అత్యంత గొప్ప ఇంజనీర్ అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య 159వ పుట్టినరోజు నేడు (సెప్టెంబరు 15). ఆయన జన్మదినాన్ని పునస్కరించుకొని ఈ రోజును దేశవ్యాప్తంగా ‘ఇంజినీర్స్ డే’గా జరుపుకుంటారు.ఆయన పేరు మీద భారతదేశమంతా ఎన్నో విద్యాసంస్థలున్నాయి…..విశ్వేశ్వరయ్య 100 సం. వయస్సులో కళ్ళద్దాలు లేకుండా చదివేవారు. “గంధపు చెక్క వలె సేవలొ అరిగిపో, కాని ఇనుములా తుప్పు పట్టవద్దు.” అనునది వారి జీవన ధ్యేయం. దేశ విదేశాలలోని విశ్వవిద్యాలయాలు వారిని సత్కరించాయి. 1961లో విశ్వేశ్వరయ్య గారి శతజయంతి ఉత్సవాలకు భారత ప్రధాని నెహ్రూ విచ్చేశారు.” మేము మాటలతో కాల యాపన చేశాం. మీరు నిరంతర క్రియాశూరులై నవభారత నిర్మాణానికి కృషి చేసిన మహనీయు” లంటూ నివాళులర్పించారు నెహ్రూ.

మోక్షగుండం విశ్వేశ్వరయ్య సెప్టెంబరు 15, 1861న చిక్కబల్లాపూర్ సమీపంలోని ముద్దెనహళ్ళిలో జన్మించారు. 20వ శతాబ్దంలో దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. జలాశయాల నిర్మాతగా, ఆర్థికవేత్తగా శాశ్వత కీర్తిని గడించారు. ఇంజినీర్‌గా జీవితాన్ని ప్రారంభించిన డాక్టర్ విశ్వేశ్వరయ్య దేశాభివృద్ధికి దోహదం చేసే అనేక నీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు.
1912 నుండి 1918 వరకు మైసూర్ దివాన్‌గా పనిచేసిన విశ్వేశ్వరయ్య… మైసూర్‌లోని కృష్ణరాజసాగర్ (కె.ఆర్.ఎస్) నిర్మించారు. మైసూర్ ‘ఆదర్శ నగరం’గా మారడంలో ఆయన పాత్ర ఎనలేనిది. హైదరాబాద్, ముంబయి నగరాలకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ రూపకల్పన, విశాఖపట్నం పోర్ట్ ఏర్పాటులో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం.
దేశాభివృద్ధిలో ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం విశ్వేశ్వరయ్యను 1955లో ‘భారత రత్న’ పురస్కారంతో గౌరవించింది. బ్రిటిష్ ప్రభుత్వం అత్యుత్తమ పౌర పురస్కారమైన ‘బ్రిటిష్ నైట్‌హుడ్’ను కూడా విశ్వేశ్వరయ్య పొందారు. దీంతో ఆయన పేరుకు ముందు ‘సర్’ వచ్చి చేరింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.