FbTelugu

కోటి ప‌రిహారంతో ఎవ‌రికి ప్ర‌యోజ‌నం!

తాంబూలాలిచ్చాం త‌న్నుకు చావండీ.. అంటే ఇదేనేమో. విశాఖ‌ప‌ట్ట‌ణం ఆర్‌.ఆర్‌.వెంక‌టాపురం ఎల్జీ పాలిమ‌ర్స్ కంపెనీ గ్యాస్ ప్ర‌మాదం రాజ‌కీయ వేడిని రేకెత్తించింది. 1964లో కాసు బ్ర‌హ్మానంద‌రెడ్డి సీఎంగా ఉన్న‌పుడు దానికి అనుమ‌తినిచ్చార‌ట‌.

ఆ త‌రువాత 1992లో అప్ప‌టి ప్ర‌భుత్వం మిన‌హాయింపులు ఇచ్చింద‌ట‌. ఇదీ టీడీపీ వాద‌న . 1999, 2014ల్లో టీడీపీ ఎల్జీ పాలిమ‌ర్స్‌ను నెత్తిన పెట్టుకుంద‌నేది వైసీపీ ఆరోప‌ణ‌. అంత‌వ‌ర‌కూ బాగానే ఉంది. 2019లో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ ఏడాది కాలంలో ఏం చేసిందనేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. ఎంపీ వి.విజ‌య‌సాయిరెడ్డి, ఎల్జీ పాలిమ‌ర్స్ కంపెనీ ఎండీ ర‌వీంధ్ర‌నాథ్‌రెడ్డి కు ఉన్న బంధుత్వం కార‌ణంగా.. ఎల్జీ పాలిమ‌ర్స్‌లో నిబంధ‌న‌ను తుంగ‌లో తొక్కార‌నేది టీడీపీ ఆరోప‌ణ‌. పైగా ప్ర‌మాదం జ‌రిగిన నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ కు కంచుకోట‌.

అందుకే వైసీపీ కావాల‌నే దీన్ని అనుకూలంగా మార్చుకుంద‌నే విమ‌ర్శలూ లేక‌పోలేదు. టీడీపీ, వైసీపీ రెండూ కార్పొరేట్ రంగాల‌కు కొమ్ము కాస్తాయ‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. ప్ర‌భుత్వాల‌ను ఏర్పాటు చేసేందుకు.. ఎన్నిక‌ల్లో నెగ్గేందుకూ కార్పొరేట్ శ‌క్తులు ఎంత‌గా ప్ర‌భావం చూపుతాయ‌నేది ద‌శాబ్దాలుగా చూస్తున్నాం. ఇప్పుడు ఏపీలోనూ ఎల్జీ పాలిమ‌ర్స్ అదే చేసింది. అయితే.. వైసీపీ, టీడీపీ ఎదుటివారిపై త‌ప్పులు నెట్టుకుంటూ ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించాల‌ని చూస్తున్నాయి.12 మంది మ‌ర‌ణించ‌టం.. విష‌వాయువు ధాటికి మూడుత‌రాలు ఫ‌లితం అనుభ‌వించాల్సి ఉంటుంద‌నే వైద్యుల హెచ్చ‌రిక‌ల‌తో సంస్థ‌ను అక్క‌డ నుంచి త‌ర‌లిస్తార‌ట‌. మ‌రి.. మ‌రోచోట గ్యాస్ ప్ర‌భావం చూప‌ద‌నే గ్యారంటీ ఉందా! అంటే స‌మాధానం క‌ష్ట‌మే. మృతుల ఒక్కో కుటుంబానికి రూ.కోటి ప‌రిహారం ఇవ్వ‌టం త‌మ ఘ‌న‌త‌గా వైసీపీ భావిస్తుంది. కానీ అదే పెద్ద త‌ప్పిద‌మంటూ టీడీపీ విమ‌ర్శిస్తుంది. చ‌ట్ట ప్ర‌కారం మృతుల ఒక్కో కుటుంబానికి రూ. 5 కోట్లు రావాల్సి ఉంటుంద‌నేది మ‌రో ఆరోప‌ణ‌. ఏమైనా రూ.1 కోటి ప‌రిహారం ప్ర‌జ‌ల్లో వైసీపీ డ‌బ్బుతో ఏమైనా చేయ‌గ‌ల‌మ‌నే ఆలోచ‌న‌కు అద్దంప‌డుతుంద‌నే భావ‌న కూడా నెల‌కొంది.

You might also like