FbTelugu

ఆధిక్యంలో టిఎంసి, డిఎంకె

న్యూఢిల్లీ: దేశంలో నేడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపుతో ప్రారంభించారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల అసెంబ్లీ తో పాటు తిరుపతి పార్లమెంటు, నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు. కరోనా కారణంగా ఈసారి గతం కన్నా నాలుగు రెట్లు పోస్టల్ బ్యాలెట్లు పెరిగాయి. బెంగాల్ లో పాగా వేయాలని, తమిళనాడులో మళ్లీ అధికారం నిలబెట్టుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేశారు. బెంగాల్ లో మమతను దెబ్బకొట్టేందుకు నెల రోజుల పాటు 8 విడతల్లో ఎన్నికలు నిర్వహించి విమర్శల పాలైన విషయం తెలిసిందే.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో 292, తమిళనాడు లో 234, కేరళలో 140 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం పశ్చిమ బెంగాల్ లో టిఎంసి 117 స్థానాలు, బిజెపి 84, కమ్యూనిస్టు పార్టీలు 8, తమిళనాడులో డిఎంకె 89, అన్నా డిఎంకె 53, కేరళలో ఎల్.డి.ఎఫ్ 78, యుడిఎఫ్ 60, అస్సాంలో బిజెపి 43, కాంగ్రెస్ 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి సువేందు అధికారి (బిజెపి) కన్నా ముందంజలో సిఎం మమతా బెనర్జీ ఉన్నారు. కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీలో ఉన్న మక్కల్ నీది మయ్యం పార్టీ అభ్యర్థి, నటుడు కమల్ హాసన్ తన సమీప ప్రత్యర్థిపై 46 ఓట్ల ముందంజలో ఉన్నారు.

నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తొలి రౌండ్ లో టిఆర్ఎస్ అభ్యర్థ నోముల భగత్ 1475 ఓట్లు ఆధిక్యంలో ఉండగా రెండో రౌండ్ లో 2218 ఓట్లు, మూడో రౌండ్ లో 4230 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇక్కడ మొత్తం 25 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. ఇక తిరుపతిలో వైసిపి అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.