FbTelugu

ఏడుకొండ‌ల స్వామి.. ఎప్పుడు ద‌ర్శ‌న‌మిస్తావ‌య్యా!

కోరిన కోర్కెలు నెర‌వేర్చే క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవంగా పిల‌వ‌బ‌డే తిరుప‌తి వెంక‌న్న స్వామి ద‌ర్శ‌నానికి భ‌క్తులు త‌హ‌త‌హ‌లాడుతున్నారు.

ఏటా వేసవి వ‌స్తే చాలు సెల‌వులు కావ‌డంతో ఏపీ, తెలంగాణ స‌హా దేశంలోని వేర్వేరు రాష్ట్రాల నుంచి ల‌క్ష‌లాది మంది భక్తులు తిరుప‌తికి వ‌స్తుంటారు. ప‌రీక్ష‌లు పూర్త‌య్యాక, ఫ‌లితాలు వ‌చ్చాక విద్యార్థులు ల‌క్ష‌ల్లో వ‌చ్చి స్వామిని ద‌ర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు.
కానీ లాక్‌డౌన్ కార‌ణంగా మార్చి 21 నుంచి తిరుమ‌ల తిరుప‌తి వెంక‌న్న ద‌ర్శ‌నాలను టీటీడీ నిలిపివేసింది. అప్ప‌ట్నుంచి భ‌క్త‌ల‌కు వెంక‌న్న దూర‌మ‌య్యాడు. నిత్యం పూజ‌లు , కైంక‌ర్యాలు య‌థావిధిగా కొన‌సాగుతుండ‌గా సాధార‌ణ భ‌క్తుల‌కు మాత్రం ద‌ర్శ‌నాలు నిలిపివేశారు. ల‌క్ష‌లాది మంది భ‌క్తులు క‌రోనావైర‌స్ ప్ర‌బ‌లుతుంద‌న్న ఉద్దేశంతో టీటీడీ, ఏపీ ప్ర‌భుత్వం ముంద‌స్తుగా ఈ నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఏడుకొండ‌ల‌వాడు ఎప్ప‌టికీ ద‌ర్శ‌న‌మిస్తాడ‌న్న‌ది తెలియ‌ని ప్ర‌శ్న‌. లాక్‌డౌన్ ఎత్తివేశాక కూడా వెంట‌నే భ‌క్త‌లంద‌రికీ ద‌ర్శ‌నం క‌ల్పించే అవ‌కాశం లేద‌ని టీటీడీ చెప్పేసింది.

ప్ర‌స్తుతం లాక్‌డౌన్‌లో సడ‌లింపులు వ‌స్తుండ‌టంతో చిత్తూరు జిల్లాలోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రాలైన కాణిపాకం, శ్రీ‌కాళ‌హ‌స్తిలో ఈ నెల 18 నుంచి భ‌క్తుల ద‌ర్శ‌నాల‌కు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే ఆల‌య క‌మిటీల‌కు దేవ‌దాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా కాణిపాకం, శ్రీ‌కాళ‌హ‌స్తి ఆల‌యాల్లో భౌతిక దూరం పాటించేలా గుర్తులు వేశారు. శానిటైజ్ చేసేందుకు యంత్రాలు సిద్ధం చేశారు.
ఇదే స‌మ‌యంలో తిరుమ‌లలో ద‌ర్శ‌నాలు క‌ల్పించాల‌ని ప‌లువురు భ‌క్తులు కోరుతున్నారు. ప్ర‌జా ర‌వాణా అయిన బ‌స్సులు, రైళ్లు, విమానాలు పెద్ద‌సంఖ్య‌లో లేక‌పోవ‌డంతో భారీ సంఖ్య‌లో భ‌క్తులు వచ్చే అవ‌కాశం లేదు. అయిన‌ప్ప‌టికీ వ్య‌క్తిగ‌త వాహ‌నాల‌పై పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లి వ‌చ్చే అవ‌కాశం ఉంది. దీనికితోడు తిరుమ‌ల కొండ‌ల‌న్నీ శానిటైజ్ చేయ‌డం టీటీడీకి త‌ల‌కుమించిన భారం అవుతుంది. ఈ త‌రుణంలో టీటీడీ బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. లాక్‌డౌన్ ఎత్తివేశాక ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ ద్వారా మాత్ర‌మే భ‌క్తుల‌ను అనుమ‌తిస్తారు.

అదీకూడా కొన్ని రోజుల‌పాటు రోజుకు 7వేల మందికి మాత్ర‌మే బుకింగ్‌కు అవ‌కాశం క‌ల్పిస్తారు. స్లాట్ ద‌క్కిన భ‌క్తులు స్వామి వారి ద‌ర్శ‌నానికి వెళ్లేప్పుడు టీటీడీ నిర్దేశించిన స‌మ‌యంలోనే వెళ్లాలి. దీనివ‌ల్ల భ‌క్తుల మ‌ధ్య భౌతిక‌దూరం పాటించేలా ఏర్పాట్లు చేసేందుకు వీలుంటుంద‌ని భావిస్తున్నారు. అలాగే భ‌క్తుల‌ను తిరుప‌తిలోనే వ‌స‌తి క‌ల్పించి ద‌ర్శ‌నానికి ముందే తిరుమ‌ల‌పైకి అనుమ‌తించే ప్ర‌తిపాద‌న‌ను టీటీడీ ప‌రిశీలిస్తోంది. అలిపిరి వ‌ద్ద ప్ర‌త్యేకంగా శానిటైజేష‌న్ ఏర్పాట్లు చేసి భ‌క్తులు, వారి ల‌గేజీని శానిటైజ్ చేశాక కొండ‌పైకి పంపిస్తారు.

You might also like