FbTelugu

వెంకన్న చెంత.. కరోనా చింత!

ఆపద మొక్కులవాడు.. వడ్డీ కాసుల వాడు అయిన తిరుపతి వేంకటేశ్వరుడి సన్నిధిలో కరోనా లొల్లి జోరందుకుంది. ఆలయంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి, గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు మధ్య వివాదం రాజుకుంది.

టీటీడీలో కరోనా కేసులు పెరుగుతున్నా పట్టించుకోవడం లేదని రమణ దీక్షితులు ఏకంగా సీఎం జగన్‌కే లేఖ రాశారు. లాక్‌డౌన్‌ కాలంలో అన్ని రంగాలతో పాటు ఆలయాలు కూడా మూతపడ్డాయి. ఇందులో భాగంగా తిరుమల వెంకన్న ఆలయం కూడా మూసివేశారు. అనంతరం లాక్‌డౌన్‌కు కేంద్రం సడలింపులు ఇచ్చిన తర్వాత మళ్లీ ఆలయంలో భక్తుల దర్శనాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 140మంది టీటీడీ సిబ్బందికి కరోనా సోకింది. ఆలయంలో 50మంది అర్చకులు ఉంటే అందులో 15మంది కరోనా బారిన పడ్డారు.

మరో 25మంది ఫలితాలు రావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టీటీడీ సిబ్బంది ఆరోగ్యం గురించి పాలకవర్గం పట్టించుకోవడం లేదని, ఇంత జరుగుతున్నా పాలకవర్గం దర్శనాలను రద్దు చేయడం లేదని రమణ దీక్షితులు సీఎంకు ఫిర్యాదు చేశారు. గతంలో చంద్రబాబు, టీడీపీ అనుసరించిన విధానాలనే ఇప్పటి పాలకవర్గం అనుసరిస్తోందని, ఇది ఇలాగే కొనసాగితే పెద్ద ఉపద్రవం అవకాశం వచ్చే ప్రమాదముందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 11న కూడా రమణ దీక్షితులు ట్విటర్‌ వేదికగా టీటీడీ పాలకవర్గంపై విమర్శలకు దిగారు. అయితే, టీడీపీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దీనిపై స్పందించారు. అర్చకుల ఆరోగ్యం విషయంలో రాజకీయ రంగు పులమొద్దని, టీటీడీ అధికారులను విమర్శలు చేయవద్దని సుబ్బారెడ్డి కౌంటర్‌ ఇచ్చారు.

అయితే, తిరుమలకు వస్తున్న యాత్రికుల ద్వారా తమకు ఎలాంటి సమస్య లేదని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు చెప్పారు. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే టీటీడీ పాలక మండలికి, రమణ దీక్షితులు, వేణుగోపాల దీక్షితుల మధ్య భేదాభిప్రాయాలు పొడచూపాయన్న విషయం అర్ధమవుతోందని భక్తులు వాపోతున్నారు. కరోనాపై తలా ఒకరీతిలో వ్యవహరిస్తున్నారని, వీరి మధ్య అభిప్రాయ భేదాలకు కరోనా ప్రభావమేనా లేక ఇతర కారాణాలేమైనా ఉన్నాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే, వారి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను సీఎం పరిష్కరిస్తారా.. లేక అవి అలాగే కొనసాగుతాయా అన్న అనుమానాలను కూడా భక్తులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కరోనా పంచాయతీ శ్రీవారినీ వదలడం లేదన్న భావన భక్తుల్లో నెలకొంది.

You might also like