FbTelugu

జగన్ కేసులపై బిగుసుకుంటున్న ఉచ్చు

అమరావతి: ఏపి ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో నమోదైన కేసులు, అధికారంలోకి వచ్చిన తరువాత ఉపసంహరించడంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.
టిడిపి ప్రభుత్వ హయాంలో జగన్ రెడ్డి పై గుంటూరు, అనంతపురం జిల్లాల్లో 11 కేసులు వివిధ పోలీసు స్టేషన్ లలో నమోదు అయ్యాయి. సిఎం అయిన తరువాత ఈ కేసులను విత్ డ్రా చేయించారు. లాక్ డౌన్ సమయంలో చడీ చప్పుడు లేకుండా ఫిర్యాదుదారులపై ఒత్తిడి తెచ్చి కేసులు ఉపసంహరింప చేయించారని వచ్చిన ఫిర్యాదుపై హైకోర్టు సుమోటోగా విచారణ జరిపింది. కొన్ని కేసులు ప్రభుత్వం జిఓలు ఇచ్చి తొలగించగా, మరికొన్ని కేసులను స్థానిక పోలీసు స్టేషన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్లు మూసివేశారు.

జగన్ పై నమోదు అయిన పలు కేసుల్లో దిగువ కోర్టులు కేసు బలాబలాలను పరిశీలించకుండా, విధి విధానాలను అధ్యయనం చేయకుండా మూసేసింది. సిఎం జగన్ పై ఉన్న కేసులను మూడు విభాగాలు ఉపసంహరించాయంటూ హైకోర్టుకు ఫిర్యాదులు అందడంతో సుమోటోగా స్వీకరించింది. దిగువ కోర్టులపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించేందుకు హైకోర్టులో ఒక కమిటీ ఉంటుంది. కమిటీ నివేదిక ప్రకారం 11 కేసుల్లో తొలి ప్రతివాదికి రాష్ట్ర ప్రభుత్వం, రెండో ప్రతివాదిగా పోలీసు స్టేషన్ సిఐ ని చేర్చారు. మూడో ప్రతివాదిగా ఫిర్యాదుదారుడిని చేర్చి, అన్ని కేసుల్లో ప్రతివాదిగా సిఎం జగన్ పేరు పెట్టారు. దీనిపై అడ్మినిస్ట్రేటివ్ కమిటీ నివేదిక అందించాలని ఆదేశించిన హైకోర్టు, నివేదిక పరిశీలించిన తరువాతే ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.