గుంటూరు: ముప్పాళ్ళ పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్ఐ జగదీష్ తనను మోశాడంటూ ఒక మహిళ నర్సరావుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
ఆ ఎస్ఐ నుంచి తనకు, తన కుమారునికి ప్రాణహాని ఉందని ఆమె ఆరోపించింది. తన భర్తతో ఏడు సంవత్సరాల క్రితం గొడవలు జరిగాయి. ఆ సమయంలో నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో భర్తపై ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. ఆ సమయంలో స్టేషన్ ఎస్ఐగా జగదీష్ పనిచేస్తున్నాడని ఆమె తెలిపారు. తన ఫోన్ నంబర్ తీసుకున్న ఎస్ఐ తనను ఇంటికి పిలిపించుకుని బలాత్కారం చేశాడని ఆమె ఆరోపించారు.
తన భర్తతో తనకు ఎస్ఐ విడాకులిప్పించాడని, తర్వాత తనను రహస్యంగా వివాహం చేసుకున్నాడని ఆమె తెలిపారు. అప్పటినుంచి అతనితో సహజీవనం చేస్తున్నానని వెల్లడించారు. కొద్ది రోజులుగా తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడని, తాను ఒప్పుకోకపోతే తనపై వ్యభిచారిణి అన్న ముద్ర వేస్తానంటూ బెదిరించాడని ఆమె విలపిస్తూ చెప్పారు.
ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్న క్రమంలో మూడు రోజుల క్రితం తనను శారీరకంగా హింసించాడని ఆమె ఆరోపించింది. తనకు, తన కుమారునికి ఆ ఎస్ఐ వల్ల ప్రాణహాని ఉందని, తనకు న్యాయం చేయాలని పోలీసును కోరినట్లు ఆమె తెలిపారు.
జగదీష్ పై ఆరోపణలు సరికాదు: మాజీ భర్త సుబ్బరావు
తన భార్య సింధూ, ఎస్ఐ జగదీష్ పై అనవసర ఆరోపణలు చేస్తున్నదని మాజీ భర్త సుబ్బారావు తెలిపారు. సింధూ, జగదీష్ మధ్య ఎలాంటి సంబంధం లేదని ఆయన కొట్టిపారేశారు. డబ్బు కోసం సింధూ ఏమైనా చేస్తుందని ఆయన అన్నారు. మేమిద్దరం 2017 లో విడాకులు తీసుకున్నామన్నారు. డబ్బుల కోసం సింధూ ఏమైనా చేస్తుందని ఆయన తెలిపారు. పిల్లలిద్దరు తమకే పుట్టారని, జగదీష్ పాత్ర లేదని సుబ్బారావు స్పష్టం చేశారు.