FbTelugu

కేటీఆర్ పిలుపుతోనే ఈ దారుణం: రేవంత్ రెడ్డి

This-is-atrocious-with-the-KTR-call-says-Revanth-Reddy

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ రెవెన్యూ అధికారులపై దాడులు చేయాలని పిలుపునివ్వడం వల్లే తహశీల్దార్ విజయారెడ్డి పై పెట్రోల్ పోసి తగులబెట్టారని మల్కాజిగిరి ఎంపీ ఏ.రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే రోజులు వచ్చాయి. పట్టపగలే ప్రభుత్వ కార్యాలయంలో ఒక అధికారిపై పెట్రోల్ పోసి తగులబెట్టడం దారుణమన్నారు. విజయారెడ్డి హత్యకు దారితీసిన పరిస్థితులపై నిజానిజాలను తేల్చేందుకు సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మేజిస్ట్రేట్ అధికారాలు ఉన్న తహశీల్దార్ పై దాడి జరగడం ఘోరమన్నారు. సుమారు 5వందల ఎకరాల భూ వివాదం కారణంగానే ఈ సంఘటన జరిగిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల ఒత్తిడి మూలంగానే విజయరెడ్డి పై దాడి జరిగిందన్నారు.

ఇంతటి అమానుషమైన సంఘటన జరిగితే న్యాయం చేస్తాం అని ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాలేదన్నారు. రెవెన్యూ శాఖ సీఎం కేసీఆర్ దగ్గరే ఉంది, ఘటన జరిగి 24 గంటలు అయినా సీఎం నివాళులు అర్పించేందుకు రాలేదన్నారు. జ్యూడిషియల్ అధికారి విధినిర్వహణలో మరణిస్తే అధికారిక లాంఛనాలతో జరపాలని ప్రకటించలేదు. విజయా రెడ్డి కుటుంబ సభ్యులను కనీసం అధికారులు పలకరించకపోవడం బాధాకరమన్నారు. రెవెన్యూ అధికారులను ప్రభుత్వం దొంగలుగా చిత్రీకరణ చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. విజయా రెడ్డి మృతదేహాన్ని చూసేందుకు ఇప్పటి వరకు రాకపోవడం బాధాకరం. మొన్న ఆర్టీసీ, నిన్న రెవెన్యూ రేపు మరో శాఖకు ఇలాంటి చేదు అనుభవాలు పునరావృతం అయ్యే అవకాశం ఉందన్నారు. ఉద్యోగులందరు సీరియస్ గా తీసుకొని ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలి. భూ వివాదం లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలి. సంఘటన పై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుంది. సీఎం నిర్లక్ష్యం పై కఠినంగా భవిష్యత్ కార్యాచరణ ఉండాలన్నారు.

You might also like