FbTelugu

సర్పంచ్‌ దొంగ

Thief-Sarpanch

అనగనగా ఒక సర్పంచ్‌.. పదేళ్లపాటు అతడు గ్రామానికి సేవలందించాడు. ఆ తర్వాత దొంగగా మారాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. ఏంటీ.. ఇది చదువుతుంటే ఇదేదో సినిమా స్టోరీ అనుకుంటున్నారా.. అచ్చంగా సినిమాలో లాగానే అనిపిస్తుందా.. కానీ, సినిమా స్టోరీ కాదు. కవులు రాసిన కథ అంతాకాదు. ఇది వాస్తవం. ఏంటీ ఇంకా నమ్మలేకపోతున్నారా.. అయితే, ఈ ఘటన ఎక్కడ.. ఎప్పుడు.. ఎలా జరిగిందో తెలుసుకోవాలనుందా.. అయితే, ఈ స్టోరీ చదవాల్సిందే.

అతడి పేరు పట్లోళ్ల విష్ణువర్ధన్‌రెడ్డి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెంకటాపురం ఊరు. ఆ గ్రామానికి ఆయన 2001 నుంచి 2011 వరకు సర్పంచ్‌గా పనిచేశాడు. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావడంతో అక్కడక్కడా అప్పులు చేశాడు. దీంతో అక్కడ నుంచి 2012లో పోతిరెడ్డిపల్లికి మకాం మార్చాడు. ఈలోగా మద్యం అలవాటైంది. ఆ అలవాటు కాస్త వ్యసనంగా మారింది. దీంతో దొంగతనాలు మొదలు పెట్టాడు. ఈ నెల 3వ తేదీన మధ్యాహ్నం చందిప్ప గ్రామానికి చెందిన చంద్రయ్య, భార్య చంద్రమ్మలు మన్‌సానిపల్లిలోని తన కూతురు వద్దకు తిరిగి వస్తున్నారు. మన్‌సాన్‌పల్లి గేటువద్ద బస్సుకోసం ఎదురు చూస్తుండగా అక్కడికి బైక్‌పై వచ్చాడు విష్ణువర్ధన్‌రెడ్డి. చంద్రయ్య, చంద్రయ్యలను చూసి వెంటనే బైక్‌ ఆపాడు. తానుకూడా శంకర్‌పల్లికి వెళ్తున్నానని చెప్పి బైక్‌పై ఎక్కించుకున్నాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత పంటపొలాల్లో బైక్‌ను ఆపి వారిని బెదిరించి వారి దగ్గరున్న రెండున్నర తులాల బంగారాన్ని దోచుకెళ్లాడు. చివరకు బాధితుల ఫిర్యాదుతో గురువారం పోలీసులు అతడిని అరెస్టుచేసి రెండున్నర తులాల బంగారం, గ్లామర్‌బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్టు ఏసీపీ రవీందర్‌రెడ్డి చెప్పారు. ఈ విషయం తెలిసిన జనం ముక్కున వేలేసుకుంటున్నారు. గ్రామస్తులకు ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి, పదేళ్లపాటు సర్పంచ్‌గా చేసిన ప్రజాప్రతినిధి ఇలాంటి నేరాలకు పాల్పడడమేంటని చర్చించుకుంటున్నారు. అతడు ఈ స్థాయికి దిగజారడానికి మద్యమే కారణమై ఉంటుందని భావిస్తున్నారు.

You might also like