FbTelugu

వారికి జనసేన.. వీరికి జగన్‌ సేన!

హైదరాబాద్‌ నగరపాలక సంస్థ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రధాన పార్టీలన్నీ చావో రేవో అన్నట్టుగా పోరాడుతున్నాయి. సోషల్‌ మీడియా మొత్తం ఈ ఎన్నికలపైనే ఫోకస్‌ చేసింది. ప్రధాన పార్టీలు కూడా సోషల్‌ మీడియాలో తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అయితే, హైదరాబాద్‌ నగర పాలక సంస్థ ఎన్నికల్లో ప్రధాన తీర్పు శివారు ప్రాంతాల నుంచే ఉంటుంది. అందుకే ఈ ప్రాంతాలపై టీఆర్‌ఎస్, బీజేపీలతో పాటు టీడీపీ కూడా కన్నేశాయి. వాస్తవానికి శివారు ప్రాంతాల్లో ఆంధ్రా సెటిలర్స్‌ ఎక్కువగా ఉంటారు. వారంతా మొదటి నుంచి టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. అందుకే తెలంగాణ ఏర్పాటు అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ మొత్తం కారు గాలి వీచినా శివారు నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ విజయబావుటా ఎగురవేసింది. అనంతర పరిణామాల్లో టీడీపీ నుంచి విజయం సాధించిన ఎమ్మెల్యేలంతా సైకిల్‌ దిగి కారెక్కారు.

ఆ తర్వాత ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ ప్రత్యేక దృష్టి పెట్టి సెటిలర్స్‌తో మాట్లాడి తమ దారికి తెచ్చుకుంది. అయినా, ఇప్పటికీ ఆ ప్రాంతాల్లో టీడీపీ, వైసీపీ, జనసేన అభిమానులే ఎక్కువగా ఉన్నారు. దీనిని క్యాష్‌ చేసుకోవడానికి వీలుగా జనసేనను ఎన్నికల నుంచి పోటీనుంచి విరమించేలా చేసి కమలం గెలుపునకు వారిద్వారా ప్రచారానికి తెరలేపింది బీజేపీ. ఇక్కడ జనసేన పార్టీగానీ, ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ గానీ ప్రచారం చేస్తే ఆంధ్రా సెటిలర్స్‌ను తమవైపునకు తిప్పుకోవచ్చనే ఆలోచనతో కమలనాథులు జనసేనను శివారు ప్రాంతాల్లో మోహరించి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక, టీఆర్‌ఎస్‌ ఎలాగూ తెలంగాణ పార్టీ కాబట్టి సెటిలర్స్‌ తమను నమ్ముతారో లేదోనని ఆ పార్టీ నేతల్లో గుబులు పట్టుకుంది. ఒకవేళ వారంతా తమకు హ్యాండిస్తే నిండా మునుగుతామని భావించిన కారు పెద్దలు తమకు సహజమిత్రులైన వైసీపీ నేతలను రంగంలోకి దింపారట. వారిద్వారా శివారు ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ప్రచారం నిర్వహిస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక్కడి సెటిలర్సుతో మాట్లాడడంతో పాటు ఆంధ్రాలో ఉన్న వారి బంధువులతో ఫోన్లు చేయించడం. తెలంగాణలో ప్రశాంతంగా ఉండాలంటే టీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలని వారు సెటిలర్స్‌తో మాట్లాడి తమ వైపునకు తిప్పుకుంటున్నారని ప్రచారం. ఇక, తెలుగుదేశం కూడా అంతో ఇంతో ఇక్కడే కాన్‌సంట్రేషన్‌ చేసింది. ఇక్కడ నుంచి కనీసం రెండు స్థానాలైన గెలిచి కౌన్సిల్‌లో పట్టు సాధించాలన్న ఆలోచనతో ఉంది. అందుకే వీరు కూడా ఆం«ధ్రా నేతలను రంగంలోకి దించారట.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో శివారు ప్రాంతాల పరిస్థితిని గమనిస్తే ఇవి తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లా లేవని ఆంధ్రాలో జరుగుతున్నట్టుగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి హైదరాబాద్‌ మేయర్‌ పీఠాన్ని తమ మిత్రులకు అప్పగించే పనిలో జనసేన, జగన్‌సేనలు ముందున్నాయన్నమాట. ఈ ఎన్నికల్లో బీజేపీ పక్షాన జనసైన్యం నిలిస్తే.. టీఆర్‌ఎస్‌ తరఫున జగన్‌ సైన్యం నిలిచిందని, ఈ ఎన్నికల యుద్ధంలో ఏ సైన్యం విజయం సాధిస్తుందోనని హైదరాబాద్‌ ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.