FbTelugu

వారు రమ్మంటున్నారు.. ఆయన రానుంటున్నారు!

దేశంలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన పార్టీ.. దేశ పాలన పగ్గాలు చేపట్టిన పార్టీ. దేశంలోనే తనకు ఎదురులేదనుకున్న పార్టీ నేడు పార్టీ అధ్యక్షుడి విషయంలో మల్లగుల్లాలు పడుతోంది. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి దారుణంగా మారింది.

గత పార్లమెంట్‌ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత పార్టీ అధ్యక్ష స్థానానికి రాహుల్‌గాంధీ రాజీనామా చేశారు. తర్వాత చాలాకాలం వరకు పార్టీకి అధ్యక్షుడే లేకుండా పోయారు. చివరకు రాహుల్‌కు పార్టీ పగ్గాలు అప్పగించిన సోనియానే తాత్కాలికంగా తిరిగి ఆ పగ్గాలను చేపట్టారు. కానీ, ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా రాహుల్‌గాంధీ తిరిగి ఆ పగ్గాలను చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. ప్రతిరోజూ పార్టీకి చెందిన సీనియర్లు పార్టీ బాధ్యతలు తీసుకోవాలని రాహుల్‌ను కోరడం.. తాను దానిని వ్యతిరేకించడం జరుగుతూనే ఉంది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. తాజాగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీలంతా కలసి మళ్లీ రాహుల్‌ పార్టీ పగ్గాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

అయితే, యథాలాపంగా రాహుల్‌ దీనిపై మళ్లీ నోరు విప్పలేదు. దీంతో రాహుల్‌ బాధ్యతలు చేపట్టకపోతే పార్టీ పరిస్థితి మరింత దిగజారే పరిస్థితులు ఉన్నాయని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీకి ఒక తాడూ బొంగరం లేని పరిస్థితిలా తయారైందని.. అనేక రాష్ట్రాల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలు చేరుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో తమ పార్టీ అధికారంలో ఉన్నా కూడా వాటిని నిలబెట్టుకోవడంలో కూడా పార్టీ అధిష్టానం ఘోరంగా విఫలమవుతోందని, పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడు ఉంటేనే కార్యకర్తలు, నాయకులకు పార్టీపై నమ్మకం పెరుగుతుందని, లేకుంటే పార్టీ పరిస్థితి మరింత అస్తవ్యస్తమయ్యే పరిస్థితి వస్తుందని వారంతా ఆందోళన చెందుతున్నారు. అయినా, రాహుల్‌గాంధీలో మాత్రం చలనం కనిపించడం లేదు. వారు రమ్మంటున్నారు… ఆయన రానుంటున్నారు అన్నట్టులా రాహుల్‌ పరిస్థితి తయారైందని ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు చర్చించుకుంటున్నారు.

You might also like