FbTelugu

అక్కడ వారు.. ఇక్కడ వీరు!

కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. రోజురోజుకూ దాని తీవ్రత మరింతగా పెరుగుతోంది. మొదట్లో ఇండియాలాంటి దేశాల్లో కాస్త తక్కువగా ఉన్నా ఇప్పుడు అక్కడ కూడా కేసులు తారాజువ్వల్లా పెరిగిపోతున్నాయి.

అయితే, ఈ కరోనా నియంత్రణలో ప్రపంచానికి క్యూబా దేశం ఆదర్శంగా నిలవగా, ఇండియాలోని రాష్ట్రాలకు కేరళ ఆదర్శంగా నిలిచింది. ఇవి, వారి ప్రాంతాల్లో కరోనా నియంత్రణలో విజయం సాధించడంతో పాటు ఇతర ప్రాంతాల వారికీ సాయం చేసే పనిలో పడ్డాయి. క్యూబా దేశం తమ డాక్టర్లను అమెరికా, ఇటలీ లాంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలకు పంపి అక్కడ కరోనాను తగ్గించే పనిలో తలమునకలైంది.

ఇప్పుడు ఇండియాలో అత్యధిక కేసులు నమోదై కకావికలమవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంది. ప్రతిరోజూ వందల్లో కేసులు నమోదవుతున్నాయి. మృతుల సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. అక్కడి ప్రభుత్వానికి దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదు. అక్కడ సరిపోను డాక్టర్లు లేరు, ప్రభుత్వ అసుపత్రులు కూడా లేవు. అయినా, కేంద్రం రాష్ట్రాలను ఆదుకోవడంలో దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిలోనే ప్రపంచ దేశాలకు క్యూబా వేగుచుక్కలా కనిపించినట్టు ఇండియాలో మహారాష్ట్ర సర్కారుకు కేరళ కనిపించింది. కమ్యూనిస్టులపై నిత్యం విమర్శలకు దిగే అక్కడి ప్రభుత్వం ఒకమెట్టు దిగి ఆ ప్రభుత్వం సాయం కోరక తప్పని పరిస్థితి ఎదురైంది. చివరకు మహారాష్ట్ర సర్కారు కేరళ వైద్యశాఖ మంత్రితో మాట్లాడి తమ రాష్ట్రానికి వైద్య సాయం చేయాలని అర్ధించింది.

వారి అభ్యర్థనతో కేరళ వెంటనే రంగంలోకి దిగింది. మొదటి విడతలో సుమారు 150 మంది డాక్టర్లను మహారాష్ట్రకు పంపింది. రెండో విడతలో మరికొంతమందిని పంపేందుకు సిద్ధం చేస్తోంది. అయితే, కరోనా నియంత్రణలో తాము ముందువరుసలో ఉండడంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా వైద్య సేవలు అందించే స్థాయికి ఎదగడానికి క్యూబా దేశం, కేరళ సర్కారు కమ్యూనిస్టు సిద్ధాంతాలను అమలు చేయడమే కారణమని అంతా భావిస్తున్నారు. ప్రజలకు ఏది అవసరమో.. కమ్యూనిస్టు ప్రభుత్వాలు వాటికే ప్రాధాన్యం ఇస్తాయని, వారి ముందుచూపు వల్లే అనేక సమస్యల నుంచి వారు గట్టెక్కడంతో పాటు ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.

You might also like