FbTelugu

ఒక్క వైరస్ కాదయ్యా… ఐదు రకాలు

బాంబు పేల్చిన ఐఎల్ఎస్ డైరెక్టర్

భువనేశ్వర్: రాష్ట్రంలో ప్రస్తుతం ఐదు రకాల కరోనా వైరస్‌ లు ప్రజలను రోగాల బారిన పడేస్తున్నాయని ద ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ (ఐఎల్‌ఎస్‌),  రీజినల్ మెడికల్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ సెంటర్(ఆర్‌ఎంఆర్‌సీ) అధ్యయనంలో వెల్లడి అయ్యింది.

ఈ ఏడాది మార్చి నుంచి జూన్‌ 18 వరకు వైరస్‌ కు సంబంధించి విస్తృత పరిశోధనలు జరిగాయి. ఐసీఎంఆర్‌ సూచనల మేరకు కొన్ని రాష్ట్రాల్లో వైరస్‌కు సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయని ఐఎల్ఎస్ డైరెక్టర్ అజయ్‌ పరిడా మీడియాకు తెలిపారు. కరోనా వ్యాక్సిన్లు కొద్ది నెలల్లో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో అవి ఏయే రకాల బాధితులపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది తమ పరిశోధనల్లో స్పష్టం అయిందన్నారు.

దీంతో సమీప భవిష్యత్తులో ఎవరికి ఏ వ్యాక్సిన్‌ ఇవ్వాలన్నది అధ్యయనం ప్రకారం నిర్ధారిస్తామని పరిడా చెప్పారు. వ్యాక్సిన్లు ఇచ్చే ముందు లోతుగా పరిశోధన చేస్తున్నామన్నారు. జూన్‌ 18 నుంచి మరికొన్ని నమూనాలు సేకరించామని, త్వరలో రెండో దశ అధ్యయనం మొదలవుతుందన్నారు. ఒడిశా లోని 18 జిల్లాల నుంచి నమూనాలు సేకరించారు. అదే విధంగా 13 రాష్ట్రాల నుంచి తిరిగివచ్చిన వలస కార్మికుల నమూనాలు కూడా సేకరించినట్లు అజయ్ పరిడా తెలిపారు.

రాష్ట్రంలో 19-ఎ, 19-బి, 20-ఎ, 20-బి, 20-సి రకాల కరోనా వైరస్‌ను గుర్తించినట్లు వారు తెలిపారు. 18 జిల్లాల నుంచి భిన్న విభాగాలకు చెందిన 225 రక్త నమూనాలపై పరిశోధనలు జరిగాయని పేర్కొన్నారు. 19-ఎ, 19-బి వైరస్‌ సోకిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని, ఈ వైరస్‌ యూరప్‌ దేశాల నుంచి వ్యాపించిందన్నారు. 20-ఎ, 20-బి కరోనా వైరస్‌ దక్షిణ, తూర్పు దేశాల నుంచి రాగా, 20-సి వైరస్‌ విదేశాల నుంచి వ్యాపించింది కాదని, రాష్ట్రానికి చెందినదని వారు వివరించారు. 20-సి వైరస్‌ బాధితుల్లో లక్షణాలు స్వల్పంగా ఉంటాయని అజయ్ వివరించారు.

You might also like