FbTelugu

కేంద్రం దారిలోకి కేసీఆర్‌!

ఇటీవల కాలంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. ఎవరూ ఊహించలేనంతగా ఆయనలో ఈ మార్పు కనిపిస్తోంది. ఆయన ఒక నిర్ణయం తీసుకోవడం.. దానికే కట్టుబడి ఉన్నానని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నిర్ణయాన్నే అమలు చేస్తానని చెప్పడం.. కొద్దిరోజుల్లోనే ఆయన తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మారడం ఇటీవల కాలంలో రెగ్యులర్‌గా చూస్తున్నాం. ఇటీవల కాలంలో కేంద్ర ప్రవేశపెట్టిన రైతు బిల్లులను వ్యతిరేకించారు. అంతేకాదు వాటికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ ప్రజాప్రతినిధులంతా బంద్‌లో పాల్గొని ఈ బిల్లులను వ్యతిరేకించేవారిలో తమకంటే ఎవరూ ముందులేరన్నట్టుగా చేశారు. ఇది జరిగిన కొన్నాళ్లకే యూ టర్న్‌ తీసుకొని కేంద్రం నిర్ణయానికి జైకొట్టారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య పథకాన్ని రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ పథకంతో కలిపి అమలు చేయాలని కేంద్రం అప్పట్లో కోరింది. కానీ, కేసీఆర్‌ సర్కారు దీనికి ససేమిరా అన్నారు. మా రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీకంటే గొప్పదా ఆ పథకం అని విమర్శలు కూడా చేశారు. కానీ, కేసీఆర్‌కు ఏమైందో కాని ఇప్పుడు తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌ను అమలు చేస్తామని చెప్పారు.

ఆయుష్మాన్‌ భారత్‌లో అప్పుడు లేని గొప్పదనం ఇప్పుడు కేసీఆర్‌కు ఏం కనిపించిందో ఆయనకే తెలియాలి. మొత్తానికి ఈ విషయంలో కూడా కేంద్రం బాటలోకి వెళ్లారు. ఆయుష్మాన్‌ భారత్‌ను తెలంగాణలో అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ స్వయంగా తెలిపారు. ఈ పరిణామాలన్నింటినీ చూస్తుంటే కేసీఆర్‌ మోదీ దారిలోకే వెళ్తున్నారని.. మున్ముందు కూడా మోదీకే జైకొట్టే పరిస్థితులు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్రం, బీజేపీతో విభేదిస్తే తనకు నష్టం జరుగుతుందని కేసీఆర్‌ గ్రహించారో.. లేక బీజేపీ నేతలు తమ దారిలోకి తెచ్చుకునేందుకు కేసీఆర్‌పై ఏమైనా ఒత్తిడి తెచ్చారో కానీ మొత్తానికి కేసీఆర్‌ బీజేపీ దారిలోకే వచ్చాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.