హైదరాబాద్‌కు ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉందా..? అంటే దీనికి అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఉగ్రవాదులు హైదరాబాద్‌ను టార్గెట్ చేశారని ఎన్ఐఏ అనుమానిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి. ఈ నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థ కూడా నిలిచిపోయింది. అందులో భాగంగానే విమానాలు, రైళ్లు కూడా ఆగిపోయాయి. అయితే, అన్ని రాష్ట్రాల్లో వలసకూలీలు ఈ లాక్డౌన్లో చిక్కుకొని అనేక అవస్థలు పడుతున్నారు. వారు సొంత గ్రామాలకు వెళ్లడానికి రవాణా వ్యవస్థ లేక వందల కిలోమీటర్లు నడిచి వెళుతున్నారు.
ఈ పరిస్థితుల్లో వారు అనేక ప్రమాదాలకు గురై మరణిస్తున్నారు. దీంతో కేంద్రం వలస కూలీలు వారి సొంత గ్రామాలకు వెళ్లేందుకు కొన్ని రైళ్లను నడుపుతోంది. దీనిని ఆసరాగా చేసుకున్న ఉగ్రవాదులు వలస కూలీల్లా ఆ రైళ్లలో ప్రయాణించి హైదరాబాద్‌ను టార్గెట్ చేసుకున్నారన్న అనుమానంతో జాతీయ భద్రతా దళాలు ఢిల్లీలో తనిఖీలు చేపట్టినట్టు ప్రచారం సాగుతోంది. అయితే, ఈ తనిఖీల్లో ఉగ్రవాదులు ఎవరూ దొరకలేదని తేలడంతో వారు ఊపిరి పీల్చుకున్నారట.