FbTelugu

రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది: బాబు

మహానాడు లో ధ్వజమెత్తిన చంద్రబాబు నాయుడు

అమరావతి: రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని, పోలవరం పనులు ఆపేశారని, భూ కబ్జాలు పెరిగాయని టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు.

మహానాడు సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక కోడెల ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆరోపించారు. డాక్టర్ శివ ప్రసాద్, నేను కలిసి చదువుకున్నామని, చిత్తూరు జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. పట్టిసీమ నీటిని కృష్ణా డెల్టాకు ఇచ్చి, కృష్ణా నీటిని రాయలసీమకు ఇచ్చేందుకు తాము చేపట్టిన పనులను కూడా ఆపేశారని ఆయన దుయ్యబట్టారు. అమరావతి రాజధానిని  కొనసాగించి ఉంటే ఎన్నో ఉద్యోగాలు వచ్చేవని, ప్రతిష్ట పెరిగేదన్నారు. కృష్ణా-గోదావరి-పెన్నా ప్రాజెక్టును కూడా పక్కన పెట్టేశారని ఆయన ఆరోపించారు.

జగన్ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని, భూకబ్జాల జోరు పెరిగిందన్నారు. పులివెందుల నుంచి వచ్చిన కొందరు ఆరోగ్యసేతు యాప్ తయారు చేసిన విశాఖకు చెందిన వ్యక్తిపై భూమి దౌర్జన్యం చేశారని అన్నారు. ఆయన భూమిని తమ పేరున రిజిస్ట్రేషన్ చేయాలంటూ బెదిరింపులకు దిగారన్నారు.

బిల్డ్ ఏపీ పేరుతో రాష్ట్రాన్ని అమ్మేయాలనుకుంటున్నారని ఆయన విమర్శించారు. కరోనా తీవ్రత పై జగన్ ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. కరోనాకు పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ సరిపోతుందని నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పారు. చివరకు బ్లీచింగ్ పౌడర్ లో కూడా అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని దారుణమైన మద్యం బ్రాండ్లు ఏపీలో ఉన్నాయని విమర్శించారు. టీడీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలను పెంచలేదని… వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్న పెంచేస్తున్నారని ఆయన విమర్శించారు.

amaravati

తెలంగాణలో ఎత్తిపోతల ఘనత బాబుదే…

తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షులు రమణ మాట్లాడుతూ, సమాజంలో మార్పునకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ నాంది పలికారు. వివిధ వర్గాలకు చట్టసభల్లో భాగస్వామ్యం ఎన్టీఆర్ గారు కల్పిస్తే.. దానిని ప్రోత్సహిస్తోంది చంద్రబాబునాయుడు అని కీర్తించారు. భూకబ్జాలు, రౌడీయిజాన్ని రూపుమాపి హైదరాబాద్ లో శాంతిభద్రతలను నెలకొల్పి, సుందరంగా తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం పార్టీదన్నారు. ఎన్టీఆర్ ఆత్మగౌరవం తీసుకువస్తే.. తెలుగు ప్రజల్లో చంద్రబాబునాయుడు ఆత్మవిశ్వాసం నింపారు. తెలంగాణలో ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఎల్టీ పాలిమర్స్ ఘటన వైసీపీ వైఫల్యానికి నిదర్శనమన్నారు.

ఏపీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు…

రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు మాట్లాడుతూ, రాజధాని లేని రాష్ట్రాన్ని ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గాడినపెట్టి ప్రపంచస్థాయికి తీసుకెళ్లారు. అపారమైన అనుభవంతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారు. అవినీతి కేసులో జైలుకెళ్లి వచ్చిన జగన్ ఏపీని నాశనం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై హైకోర్టు 67 సార్లు మొట్టికాయలు వేసిందన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే వేధిస్తున్నారని వెంకట్రావు మండిపడ్డారు.

You might also like