FbTelugu

బీసీల గొంతు నొక్కుతున్న వైసీపీ: ఎమ్మెల్సీ బీద

నెల్లూరు: బీసీ ల గొంతు నొక్కేందుకు వైసీపీ దశల వారీ ప్రణాళిక అమలు చేస్తోందని, బీసీ లంతా సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమైందని టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అన్నారు.

బీసీ అభివృద్ధిపై పక్షపాత ధోరణి, బీసీ నాయకులే లక్ష్యంగా వైసీపీ నాయకులు చేస్తున్న కుట్రల ను ఎండగడుతూ నెల్లూరు జిల్లా కు చెందిన బీసీ ముఖ్యనేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బీద రవిచంద్ర మాట్లాడుతూ, నెల్లూరు జిల్లాలో బీసీ భవన్ శంకుస్థాపన శిలాఫలకం ధ్వంసం చేయడం ద్వారా బీసీ ల పై వైసీపీ నాయకులకు ఉన్న  ఆక్రోశాన్ని, చిన్న చూపు ని మరోసారి వ్యక్తపరిచారన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఈ వర్గాలను అణగదొక్కాలనే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని ఆరోపించారు. ఈ వర్గ నాయకులే లక్ష్యంగా దుష్ప్రచారం, అవాస్తవ కట్టు కథనాలు, అనిచివేత చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. వీరు అభివృద్ధి చెందడాన్ని వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. బీసీల సంక్షేమం కోసం కేటాయించిన పథకాలన్నీ నిర్వీర్యం చేశారు. ఏడాది పాలనలో ఒక్క  బీసీకి సబ్సిడీ లోన్ ఇచ్చిన పాపాన పోలేదన్నారు. గత తెదేపా ప్రభుత్వం చివరి ఏడాది ఇచ్చిన సబ్సిడీ లోన్ లను సైతం రద్దు చేసింది.

స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీల రిజర్వేషన్లకు భారీ కోత విధించారు. 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించామని వైసీపీ ప్రభుత్వం  చెప్పినా వాస్తవానికి నెల్లూరు జిల్లాలో కనీసం 15 శాతం రిజర్వేషన్ కూడా దక్కని దౌర్భాగ్య పరిస్థితి కల్పించారు.

You might also like