FbTelugu

ఆదివారం ఆకాశంలో అద్భుతం

21 జూన్‌ 2020 ఆదివారం అంతరిక్షంలో ఒక అద్భుతం ఆవిష్కరించబడుతుంది. 2020 సంవత్సరంలో మొట్టమొదటి సూర్యగ్రహణం ఆ రోజు ఏర్పడబోతోంది.

జూన్‌ 21న ఏర్పడబోయేది వలయాకార సూర్య గ్రహణం. చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతూ ఉన్న క్రమంలో ప్రతీ నెలలో ఒకసారి భూమికి అతి దగ్గరగా, అతి దూరంగా ఉంటాడు. భూమికి అతి దగ్గరగా ఉండే స్థానాన్ని పెరిజీ అని, భూమికి అతి దూరంగా ఉండే స్థానాన్ని అపోజీ అని అంటారు. జూన్‌ 15న చంద్రుడు అపోజీ స్థానంలోకి వచ్చాడు.

భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు అపోజీ స్థానంలో ఉండటం వల్ల సూర్యబింబాన్ని పూర్తిగా కప్పేంత సైజులో చంద్రుడు ఉండడు. తద్వారా సూర్యుడి యొక్క పరిధి భాగం కొంత కనిపిస్తుంది. అందువల్ల సూర్యబింబం వలయాకార రూపంలో ఉంటుంది. అందువలనే దీనిని వలయాకార సూర్యగ్రహణం అంటారు. లాటిన్‌లో ఆన్యూలార్‌ అంటే ఉంగరం. ఈ అంగులీయక (వలయాకార) సూర్యగ్రహణం చూడటం ఓ అద్భుత దృశ్యం.

మన దేశంలో ఈ గ్రహణం ఘర్యానా (రాజస్తాన్‌), సిర్సా(హర్యానా), డెహ్రాడూన్, టెహ్రా (ఉత్తరాంచల్‌) ప్రాంతాల్లో మాత్రం సంపూర్ణంగా కనిపిస్తుంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో పాక్షికంగా సూర్యగ్రహణం కనిపిస్తుంది. అంటే అంగులీయక సూర్యగ్రహణన్ని మనం చూడలేము. మామూలు సమయంలోనైనా సూర్యుడిని నేరుగా చూస్తే చాలా ప్రమాదం అని మీకు తెలుసు కదా. రెటీనా దెబ్బతిని కనుచూపు పోయే ప్రమాదము ఉంది. సూర్యగ్రహణం సమయంలో కూడా అంతే. సూర్యుగ్రహణాన్ని కంటితో నేరుగా చూడడం ప్రమాదకరం.

అయితే, శాస్త్రీయంగా తయారు చేసిన సోలార్‌ ఫిల్టర్స్‌ ద్వారా మాత్రమే గ్రహణాన్ని వీక్షించాలి. పిన్‌ హోల్‌ కెమెరా ద్వారా గ్రహణ ప్రతిబింబాన్ని చూడవచ్చు. బాల్‌ మిర్రర్‌ ద్వారా కూడా గ్రహణ ప్రతిబింబాన్నిగోడ పై/ తెర పై చూడవచ్చు. అలాగే ఒక అట్టముక్కకు గుండ్రని రంధ్రం చేసి గోడకు దగ్గరగా సూర్యునికి ఎదురుగా అమర్చితే గోడపై కూడాగ్రహణ ప్రతిబింబం స్పష్టంగా చూడవచ్చు.

గ్రహణాలు: మూఢనమ్మకాలు – వాస్తవాలు
1. సూర్యగ్రహణం అంటే రాహువు మింగడం…
వాస్తవం: భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు, భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనబడకుండా పోవడం వలన సూర్యగ్రహణము ఏర్పడుతుంది.
2. గ్రహణ సమయంలో భూమి మీద, ఆహార పదార్థాలలో సూక్ష్మజీవులు విజృంభిస్తాయని, అందువలన గ్రహణ సమయంలో ఏమీ తినకూడదు…
వాస్తవం: రోగాలకు ఎటువంటి సూక్ష్మజీవులు, ఎలా కారణమో ’రాబర్ట్‌ కాక్‌’ 1880 లలో నిరూపించారు! అనేకమంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఔత్సాహికులతో పాటు సామాన్య ప్రజానీకం ముఖ్యంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆహారాన్ని తీసుకొంటున్నారు. ఎవరూ అనారోగ్యం బారిన పడలేదు.
3. ’గ్రహణ మొర్రి’ అనేది గర్భవతులు గ్రహణాలు చూడటం వలన వస్తుంది…
వాస్తవం: జన్యు పరంగా దగ్గరి సంబంధం గల మేనరిక పెళ్లిళ్ల వలన మొర్రి గల పిల్లలు పుడతారు. పిండం ముఖం ఏర్పాటులో, కొన్ని ముఖ ఫలకాలు అతుక్కోవటంలో లోపం వలన ఇది ఏర్పడుతుంది.
4. 2019 డిసెంబరు 16న ఏర్పడిన సూర్యగ్రహణంతో ’కొరోనా వైరస్‌’ వ్యాప్తి మొదలైందని, అది ఈ జూన్‌ 21న ఏర్పడే గ్రహణంతో అంతమౌతుంది…
వాస్తవం: ఇది ఒట్టి పుకారు మాత్రమే. ఇవి కుతర్కంతో కూడిన వ్యాఖ్యలు. సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు ఎర్రటి రింగు సూర్యుని చుట్టూ కనిపిస్తుంది. దీనిని కరోనా అంటారు. ’కరోనా’ అంటే సూర్యుడి బాహ్య వాతావరణంలోని వెలుగు. గ్రహణ కాలంలో, సూర్యుడి వెలుతురు తగ్గిపోయి, ’కరోనా’ పూర్తిగా కనిపిస్తుంది. గ్రహణ సమయంలో కనబడే కరోనాకి, కొరోనా వైరస్‌నకు ఎలాంటి సంబంధం లేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.