FbTelugu

తెలంగాణకు దక్కని చోటు

‘‘తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధిస్తోంది.. ఇక్కడ చేపట్టినన్ని కార్యక్రమాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ చేపట్టలేదు. ఇక్కడి పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయి.

హైదరాబాద్‌తో పాటు అనేక నగరాలు స్వచ్ఛతగా ఉంచేందుకు కృషి చేస్తున్నాం. హైదరాబాద్‌ను స్వచ్ఛ హైదరాబాద్‌గా మారుస్తున్నాం.’’అని చెబుతున్న తెలంగాణ సర్కార్‌కు ఆ జాబితా ఒకరకంగా షాక్‌ ఇచ్చినట్టే. మున్సిపల్‌ శాఖా మంత్రిగా సీఎం కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌ వ్యవహరిస్తున్నారు. నిత్యం హైదరాబాద్‌ నగరంలో పారిశుధ్యంపై అధికారులతో సమీక్షలు నిర్వహించి నగరాన్ని స్వచ్ఛతగా ఉంచేందుకు అనేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెబుతున్నారు.

అయితే, ఇటీవల వెలువడిన స్వచ్ఛ నగరాల రేటింగ్‌లో తెలంగాణలోని నగరాలేవీ కనిపించలేదు. కనీసం సింగిల్‌ స్టార్‌ ర్యాంకింగ్‌కు కూడా నోచుకోలేదు. పైగా ఏపీలోని పలు నగరాలకు ఈ ర్యాంకింగ్‌ దక్కడం కూడా తెలంగాణకు ఒక షాకులాంటి వార్తే మరి. వ్యర్థాల(గార్బేజ్‌) నిర్వహణలో సమర్ధంగా వ్యవహరించినందుకు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంగళవారం ఈ నగరాలకు ‘గార్బేజ్‌ ఫ్రీ నగరాలుగా’ అత్యుత్తమ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది.

దేశవ్యాప్తంగా ఆరు నగరాలకు 5స్టార్, 65 నగరాలకు 3స్టార్, 70 నగరాలకు స్టార్‌ ప్రకటిస్తున్నట్లు గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ తెలిపారు. కరోనాపై పోరులో స్వచ్ఛభారత్‌ మిషన్‌ గణనీయ పాత్ర పోషిస్తోందన్నారు. 2019–20 సంవత్సరానికి గానూ మొత్తం 1,435 నగరాలు ఈ రేటింగ్‌ కోసం దరఖాస్తు చేసుకోగా, 141 నగరాలకు రేటింగ్స్‌ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.

స్వచ్ఛ నగరాల రేటింగ్స్‌లో అంబికాపూర్‌(ఛత్తీస్‌గఢ్‌), రాజ్‌కోట్, సూరత్‌ (గుజరాత్‌), మైసూర్‌(కర్ణాటక), ఇండోర్‌(మధ్యప్రదేశ్‌), నవీ ముంబై(మహారాష్ట్ర)లకు అత్యున్నత 5స్టార్‌ లభించింది. 3 స్టార్‌ రేటింగ్‌ పొందిన వాటిలో న్యూఢిల్లీ, కర్నాల్‌ (హర్యానా), చండీగఢ్, అహ్మదాబాద్‌(గుజరాత్‌), భోపాల్‌(మధ్యప్రదేశ్‌), జంషెడ్‌పూర్‌(జార్ఖండ్‌).. మొదలైనవి ఉన్నాయి. ఢిల్లీ కంటోన్మెంట్, రోహ్‌తక్‌(హర్యానా), గ్వాలియర్‌(మధ్యప్రదేశ్‌), వడోదర, భావ్‌నగర్‌ (గుజరాత్‌)లకు 1 స్టార్‌ లభించింది. ఇందులో తెలంగాణకు ఒక్క స్థానం కూడా దక్కకపోగా, ఏపీలోని తిరుపతి, విజయవాడ పట్టణాలకు 3స్టార్, చిత్తూరు జిల్లా పలమనేరు, ప్రకాశం జిల్లా చీరాల, గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణాలకు వన్‌స్టార్‌ రేటింగ్స్‌ దక్కాయి.

You might also like