FbTelugu

ఆ ఐఏఎస్ హోటల్ బిల్లు రూ.2.5 లక్షలు

అమరావతి: ఆయన సీనియర్ ఐఏఎస్ అధికారి. ఇతరులకు సుద్దులు చెప్పే ఆయన ప్రభుత్వ ఖజానాకు రూ.2.5 లక్షలు చిల్లు వేశారు. ప్రభుత్వ సొమ్మును నీళ్లలా ఖర్చు చేశారు.

కరోనా నియంత్రణ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉన్నతాధికారి డ్రైవర్ కు  పాజిటివ్ సోకింది. ఈ విషయం తెలిసిన వెంటనే సదరు ఐఏఎస్ క్వారంటైన్ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలో ప్రభుత్వ గెస్టు హౌస్ లేదా  కార్యాలయంలో ఉండే బదులు ఏకంగా స్టార్ హోటల్ లో సూట్ అద్దెకు తీసుకున్నారు. రెండు వారాల పాటు బస చేశారు. రెండు వారాల తరువాత హోటల్ యాజమాన్యం రూ.2.5 లక్షల బిల్లును పంపించింది.

బిల్లును చూసి ఉన్నతాధికారి పనిచేస్తున్న శాఖ అధికారులు నివ్వెరపోయారు. అయితే ఆ బిల్లును తన శాఖ ద్వారా ఫైలు సిద్ధం చేసి ఆర్థిక శాఖకు పంపించారు. బిల్లును చూసిన ఆర్థిక శాఖ అధికారులకు గుండె గుభెల్లుమంది. ఆర్థిక శాఖ కిమ్మనలేక ఏకంగా రూ. 2.5 లక్షల బిల్లును మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది.

కాగా, ఆ అధికారి క్వారంటైన్‌ను కూడా సరిగ్గా పాటించడంలేదని సిబ్బంది చర్చించుకుంటున్నారు. వారం రోజులు మాత్రమే కదలకుండా తన రూమ్‌లోనే ఉన్నారు. ఆ సమయంలో కూడా కార్యాలయం సిబ్బందిని హోటల్‌కు పిలిపించుకొన్నారని, ఫైల్స్‌పై సంతకాలు చేయడం వంటివి చేశారని అంటున్నారు.

గత వారం రోజులుగా క్వారంటైన్‌ ఉల్లంఘించి కార్యాలయానికి వెళ్లి తిరిగి సాయంత్రానికి హోటల్‌ గదికి చేరుకొంటున్నారు. ఆయన తీరుతో ఆ శాఖ అధికారులే విస్తుపోతున్నారు.

You might also like