FbTelugu

గుణపాఠం నేర్వని సర్కారు!

కరోనా ప్రపంచానికి అనేక గుణపాఠాలు నేర్పింది. కొవిడ్‌–19 నుంచి అనేక దేశాలు ఈ గుణపాఠాలను నేర్చుకుంటున్నా.. ఇండియాలో మాత్రం దానిని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనా కాలంలో వైద్య చికిత్సలు అందించేందుకు డాక్టర్లు ఎంతో అవసరమయ్యారు. డాక్టర్లు సరిపోను లేక అనేక దేశాలు అతలాకుతలం అయ్యాయి. కరోనా కాలం డాక్టర్ల ఆవశ్యకతను తెలియజేసింది. క్యూబాలో కోటిమంది జనాభాకు లక్షమంది డాక్టర్లు ఉండడంతో అక్కడ కరోనా పప్పులు ఉడకలేదు. పైగా అక్కడి డాక్టర్లు బాగా అభివృద్ధి చెందామని విర్రవీగుతున్న దేశాలకు కూడా వైద్య సేవలు అందించాల్సిన పరిస్థితి వచ్చింది.

అగ్రదేశాలు మాకు డాక్టర్లను పంపించండి మహాప్రభో అంటూ ఆ దేశాన్ని బతిమిలాడుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయంటే ప్రతి దేశానికీ డాక్టర్ల సేవలు ఎంత అవసరమో.. వారి సంఖ్య ఎంతగా పెరగాలో తెలిసింది. కానీ, వీటి నుంచి భారత్‌ మాత్రం పాఠాలు నేర్చుకోవడం లేదు. ఇక్కడ డాక్టర్లను సంఖ్యను పెంచాల్సింది పోయి.. ఆ విద్య అందరికీ అందకుండా చేస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం డబ్బున్న వారికే వైద్యవిద్య అందిస్తామన్న రీతిలో వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

ఫీజులను భారీగా పెంచి పేదలకు వైద్యవిద్యను దూరం చేస్తోందని.. అందులో భాగంగానే మెడికల్‌ పీజీ ఫీజులను రూ.3.75లక్షల నుంచి రూ.7లక్షలకు పెంచిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకేసారి ఇంతమొత్తంలో ఫీజులను పెంచితే సామాన్యుల పరిస్థితి ఏమిటని సామాన్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వైద్యరంగాన్ని వ్యాపారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

You might also like