FbTelugu

చిలుకూరు లోనే చిరుత: అటవీ శాఖ

చిలుకూరు, రాజేంద్రనగర్ వాసులు జాగ్రత్త

రాష్ట్ర అటవీ శాఖ హెచ్చరిక

హైదరాబాద్: నగరంలో కన్పించిన చిరుత ఆ తరువాత మాయమై 36 గంటలు దాటుతున్నా చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నది.

నిన్న మైలార్ దేవుపల్లి అండర్ బ్రిడ్జీ ప్రాంతంలో కన్పించి, అంతలోనే మాయమైన చిరుతపులి శంషాబాద్ ప్రాంతం నుంచి వెళ్లిపోయినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. లభించిన ఆనవాళ్ల ప్రకారం ప్రస్తుతం చిల్కూరు అటవీ ప్రాంతంలో ఉన్నట్లు అటవీ శాఖ నిర్థారణకు వచ్చింది.

telangana forest

గురువారం ఉదయం చిరుత మైలార్ దేవుపల్లి అండర్ బ్రిడ్జి రోడ్డుపై డివైడర్ పక్కన నీరసంగా కూర్చుని ఉంది. వచ్చిపోయే వారు, ఎదురుగా నివసిస్తున్న వారు దాన్ని చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ, స్థానిక పోలీసులు, నెహ్రూ జూ పార్క్ అధికారులకు ఫోన్ చేసి తెలిపారు. అక్కడికి చేరుకునే లోపే అది అక్కడి నుంచి పరుగులు తీసింది. దాన్ని పట్టుకుని బంధించేందు శుక్రవారం ఉదయం మొదలైన ఆపరేషన్ ఈరోజు కూడా కొనసాగింది.

శంషాబాద్ సమీపంలో ఓ ప్రైవేట్ వ్యవసాయ క్షేత్రంలో జల్లెడ పట్టిన అధికారులు చిరుత జాడలను పాదముద్రల సహకారంతో ఆనవాళ్లు గుర్తించారు. అది తిరిగిన ప్రాంతాల ఆధారంగా గుర్తించే ప్రయత్నాలు చేశారు. ఆ ప్రాంతంలో డ్రోన్ కెమెరాలు వినియోగించారు. పోలీసు శాఖ సహకారంతో అటవీశాఖ అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా శోధించారు. డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల చిత్రాలను విశ్లేషించారు. చివరకు చిరుత పాదముద్రలను ఫామ్ హౌస్ లో గుర్తించిన అటవీశాఖ అధికారులు, పోలీసుల డాగ్ స్క్వాడ్ సహకారంతో చిరుత ఏ వైపుగా వెళ్లి ఉంటుందో తేల్చారు.

గురువారం రోజంతా అక్కడే ఉండి, రాత్రి జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ మీదుగా చిలుకూరు అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్లు గుర్తించారు. వ్యవసాయ క్షేత్రంలో సీసీ కెమెరాల్లో చిరుతకు ఆహారంగా పనికి వచ్చే జంతువులు అక్కడ ఉన్నట్లు గుర్తించారు. మళ్లీ ఆహారం కోసం అక్కడికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు దానిని బంధించేందుకు అవసరమైన  బోనులను (Cage), సీసీ కెమెరాలను కొనసాగించాలని నిర్ణయించారు.

అలాగే ఒక ప్రత్యేక పర్యవేక్షణ టీమ్ ను, రెస్క్యూ గ్రూప్ ను ఆ ప్రాంతంలోనే కొనసాగించాలని అధికారులు ఆదేశించారు. మళ్లీ చిరుత నగరం వైపు రాకుండా తగిన చర్యలు తీసుకోవడంతో పాటు, చిలుకూరు అటవీ ప్రాంతంలో నిత్యం నిఘా పెడతామని, ప్రజలను అప్రమత్తం చేస్తామని అటవీశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. చిలుకూరు తో పాటు జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిరుత జాడలు కనిపించిన వెంటనే అటవీశాఖ కు సమాచారం ఇవ్వాలని కోరారు.

You might also like