FbTelugu

హైద‌రాబాద్‌లో లండ‌న్ అందాలు

ఎన్నో ప్ర‌త్యేక‌త‌లు…. మ‌రెన్నో అందాల‌కు నెల‌వైన హైద‌రాబాద్‌కు మ‌రింత శోభ చేకూర‌నుంది. లండ‌న్ అందాలు వ‌చ్చి చేర‌నున్నాయి.

ఇదేమిటీ హైద‌రాబాద్‌లో లండ‌న్ అందాలు ఎలా..? అని అనుకుంటున్నారు. లండ‌న్ బ్రిడ్జి త‌ర‌హాలో దుర్గం చెరువుపై నిర్మిస్తున్న వంతెన దాదాపు పూర్తి కావొచ్చింది. ఇప్ప‌టికే ఈ వంతెన అందాలు న‌గ‌ర‌వాసుల‌ను ఎంతో ఆక‌ర్షిస్తున్నాయి. వేలాది కోట్ల రూపాయాలు ఖ‌ర్చు పెట్టి తెలంగాణ ప్ర‌భుత్వం హైద‌రాబాద్‌ను విశ్వ‌న‌గ‌రంగా మార్చుతోంది

cable bride

ఇందులో వంతెన‌లు, అండ‌ర్‌పాస్‌లు నిర్మిస్తోంది. వీటన్నింటిలో ప్ర‌ధాన‌మైన‌ది దుర్గంచెరువు వంతెన‌. హైటెక్‌సిటీలోని దుర్గంచెరువుపై లండ‌న్‌లోని తీగ‌ల వంతెన త‌ర‌హాలోనే ఆధునాత‌న ప‌ద్ధ‌తిలో వంతెన నిర్మాణం జ‌రుగుతోంది. హైద‌రాబాద్ అనగానే ఇన్నాళ్లూ చార్మినార్‌, హుస్సేన్‌సాగ‌ర్‌, హైటెక్‌సిటీలోని సైబ‌ర్‌ట‌వ‌ర్స్ భ‌వ‌నం గుర్తుకు వ‌చ్చేవి. ఇప్ప‌డు దుర్గంచెరువుపై నిర్మిస్తున్న కేబుల్ వంతెన గుర్తుకు వ‌చ్చేలా ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది.

ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుని ప‌నులు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. దీని నిర్మాణం పూర్త‌యితే హైద‌రాబాద్‌కు మ‌రో ఐకాన్‌గా మారుతుంద‌నడంలో సందేహం లేద‌ని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. దీని నిర్మాణం ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి నాటికే పూర్తి చేసి ప్రారంభించాల‌ని ప్ర‌భుత్వం భావించింది. కానీ సాధ్య‌ప‌డ‌లేదు.

మ‌ళ్ళీ జూన్ 2వ తేదీన రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా ప్రారంభించాల‌ని భావించారు గానీ విద్యుత్తు దీపాల అందాలు అందించ‌డంలో జాప్యం జ‌రిగే అవ‌కాశాలున్నాయి. కొవిడ్‌-19 కార‌ణంగా లాక్‌డౌన్ రావ‌డంతో ప‌నులు స‌రిగా జ‌ర‌గ‌లేదు. అందుకే చివ‌రికి జులై ఆఖ‌రుక‌ల్లా ఎట్టి ప‌రిస్థితుల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాల‌ని మంత్రి కె.తార‌క‌రామారావు అధికారుల‌ను ఆదేశించారు.

దుర్గం చెరువు వంతెన ఎన్నోప్ర‌త్యేక‌త‌లు సంత‌రించుకుంది. ఇప్ప‌టికే ఇంజినీరింగ్ నిపుణులు దీన్నొక అద్బుతంగా వ‌ర్ణిస్తున్నారు. 425 మీట‌ర్ల పొడ‌వుతో 184కోట్ల భారీ వ్య‌యంతో వంతెన నిర్మాణం జ‌రుగుతోంది. 53 సెగ్మెంట్ల‌తో నిర్మిస్తున్నారు. ఇది క‌నుక పూర్త‌యితే ప్ర‌పంచంలోనే స్పాన్ల సాయంతో నిర్మించిన పొడ‌వైన వంతెన‌ల్లో ఒక‌టిగా నిలుస్తుంది. వంతెన పూర్త‌యితే జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్‌….. అంటే హైటెక్‌సిటీలోకి ప్ర‌వేశించ‌డానికి మార్గం ఏర్ప‌డుతుంది. 9కోట్లు వెచ్చించి మ‌రీ ఎల్.ఇ.డి. దీపాలు ఏర్పాటు చేస్తున్నారు. జులై 30న ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ అధికారులు శ్ర‌మిస్తున్నారు.

You might also like