విశాఖపట్నం: వైసీపీ ప్రభభుత్వం అరెస్టు చేసిన డాక్టర్ సుధాకర్ కుటుంబసభ్యులను తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పరామర్శించారు.
వారి కుటుంబ సభ్యులకు ఆమె ధైర్యం చెప్పి ఓదార్చారు. సుధాకర్‌ను పిచ్చాసుపత్రికి తరలించడం దారుణమన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మాట్లాడుతూ.. డాక్టర్ సుధాకర్ తల్లి షాక్‌లో ఉన్నారన్నారు. కొడుకును ఈ స్థాయి వరకు చదివించి, పైకి తీసుకురావడానికి తల్లిదండ్రులు చాలా కష్టపడతారని, ఆ కష్టం ఇవాళ బూడిదలో పోసిన పన్నీరయిందన్నారు.
కేవలం మాస్కులు అడిగిన పాపానికి తన కొడుకును పిచ్చోడిని చేశారని ఆ తల్లి కన్నీటిపర్యంతమైన్నారు. డాక్టర్ సుధాకర్ 26 ఏళ్ల సర్వీసులో ఎక్కడ చిన్న మచ్చ కూడా లేదని, అడిగిన పాపానికి సస్పెండ్ చేశారని మండిపడ్డారు. ఉగ్రవాది కసబ్ లాంటివాళ్లను అరెస్టు చేసి తీసుకెళ్లే విధంగా డాక్టర్ రెండు చేతులు వెనక్కి కట్టి, లాఠీతో కొట్టి తీసుకువెళ్లడం అమానుషమని అనిత అన్నారు.
ఇంతకుముందు నరసరావుపేటలో రెడ్డి కులానికి చెందిన డాక్టర్ కూడా ఇలాగే మాట్లాడితే ఎలాంటి చర్యలు తీసుకోలేదని అనిత విమర్శించారు. సుధాకర్ దళితుడు కాబట్టి కక్షగట్టి చర్యలు తీసుకున్నారని ప్రభుత్వంపై అనిత మండిపడ్డారు. ఇది ప్రభుత్వ వైఫల్యమని, డాక్టర్ సుధాకర్ ఆ విధంగా ఉండడానికి కారణం సీఎం జగన్ రెడ్డి అని, ఆయనపై కేసులు పెట్టాలని అనిత డిమాండ్ చేశారు.