హైదరాబాద్: విశాఖపట్నంలో నిరసన చేస్తున్న దళిత డాక్టర్ సుధాకర్ రావు పై దాడిని టీడీపీ అధ్యక్షులు ఎన్.చంద్రబాబు నాయుడు ఖండించారు.
నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దురాగతానికి నైతిక బాధ్యత సీఎం జగన్ రెడ్డి దే బాధ్యత అన్నారు. విశాఖలో దళిత వైద్యుడిపై దాడి అమానుషమని, సభ్య సమాజం తలదించుకునేలా చేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆయన చేతులు కట్టేయడం, లాఠీలతో కొట్టడం హేయమన్నారు. ప్రశ్నించే వ్యక్తులందరినీ హింసిస్తారా అని అడిగారు. డాక్టర్ సుధాకర్ ఈ పరిస్థితికి చేరుకోవడానికి సీఎం జగనే కారణమన్నారు. మాస్క్ లు అడిగిన వైద్యుడిని సస్పెండ్ చేసిన చరిత్ర దేశంలోనే లేదన్నారు.
సుధాకర్ ఉదంతంపై సమగ్ర విచారణ జరపాలని, కాల్ లిస్ట్ విశ్లేషించాలన్నారు. ఎవరెవరు ఆయనను వేధించారు, బెదిరించారో విచారణ చేయాలని కోరారు.
మంత్రి పేర్ని నాని బెదిరించారు…
డాక్టర్ సుధాకర్ మాస్కులు లేవని నిలదీసిన రోజే మంత్రి పేర్నినాని అగ్రకుల దురంహకారంతో రెచ్చిపోయారని మాజీ మంత్రి కేఎస్.జవహర్ ఆరోపించారు. ఒరేయ్ డాక్టర్ నీ మదం అణిచివేస్తా అంటూ హెచ్చరించారని అన్నారు. చివరికి దళితుడైన డాక్టర్ని సస్పెండ్ చేసి, ఆయన కుమారుడిపై కేసులు పెట్టించి, దళితులపై ఫ్యాక్షన్ ఉక్కుపాదం మోపిన సీఎం తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
గవర్నర్ జోక్యం చేసుకోవాలి…
దళితుల పట్ల దమనకాండ సాగిస్తున్న సీఎం జగన్ రెడ్డి సర్కారుని వెంటనే బర్తరఫ్ చేయాలని మాజీ మంత్రి కిడారి శ్రవణ్ డిమాండ్ చేశారు. సుధాకర్ మాస్కుల్లేవని ప్రశ్నించినందుకు సస్పెండ్ చేశారన్నారు. అయినా కక్ష తీరక పోలీసులతో వెంటాడి వేధిస్తున్నారన్నారు. గవర్నర్ జోక్యం చేసుకుని ఏపీలో దళితులకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు.